నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన సీఎంఆర్ రైస్ డెలీవరి చేయాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

*ఎఫ్.సి.ఐ తో సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు

*రైస్ మిల్లులను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలి

*సీఎంఆర్ రైస్ డెలివరీపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ప్రజాబలం ఏప్రిల్ -13:

జిల్లాలో మిల్లర్లు ఎఫ్.సి.ఐ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన సీఎంఆర్ రైస్ డెలీవరి అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు.

గురువారం సాయంత్రం స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తో కలిసి సీఎంఆర్ రైస్ డెలివరీపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి, రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సి.ఎం.ఆర్. రైస్ డెలివరీ చేయాలనీ, యాసంగి పంటకు సంబంధించిన పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

2021-22 యాసంగి రైస్ డెలీవరి సంబంధించి మరో 12 రోజుల సమయం మాత్రం ఉందని, రైస్ మిల్లులు పూర్తి సామార్థ్యంతో నిర్వహించి ఎఫ్.సి.ఐ కు డెలివర్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎఫ్.సి.ఐ వద్ద రైస్ మిల్లర్లకు ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని, ఎఫ్.సి.ఐ వద్ద డీటీ లను ఏర్పాటు చేసి సమన్వయం చేస్తామని అన్నారు.

రైస్ మిల్లర్లు సైతం నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైస్ డెలీవరి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎఫ్.సి.ఐ గోదాం వద్ద అధిక సమయం వాహనాలు వేచి చూడకుండా త్వరితగతిన గోదాం స్పేస్ చూపించాలని, హామాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.

రైస్ మిల్లర్ల సమస్య క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు వచ్చే మంగళవారం అదనపు కలెక్టర్, ఎఫ్ సి.ఐ రీజినల్ మేనేజర్ సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో ఎఫ్.సి.ఐ. గోదాములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో ఎఫ్.సి.ఐ రీజనల్ మేనేజర్ విశాల్ గుప్తా, జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్లు, మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking