కాలేశ్వరం ప్రాజెక్టు పనుల భూసేకరణ ను ప్రభుత్వ అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజర్షి షా

మెదక్, ఫిబ్రవరి 25, 2023 ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 13, రామాయంపేట కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే పనులను వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, భూ సేకరణ, 13వ ప్యాకేజి, రామాయంపేట, శంకరంపేట కెనాల్ పనులకు సంబంధించి అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి నీటిపారుదల, రెవిన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏజెన్సీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ప్రధానంగా రామాయంపేట కాలువకు సంబంధించి భూ సేకరణ పనులు, చిన్న శంకరంపేట్ కు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి పెగ్ మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ కు సంబంధించి అవార్డు పాసైన వాటికి నిధులు మంజూరు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలు సాగు నీటిని అందించేందుకు గాను కాలువల నిర్మాణానికి వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని అన్నారు. సర్వే టీమ్ లు ఏర్పాటు చేసి వారం రోజులలోగా పనులు పూర్తి చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని ఆదేశించారు. ఏజెన్సీలు కూడా పనుల వేగవంతానికి స్వతహాగా సర్వే టీమ్ తెచ్చుకొని మా అధికారుల సమన్వయంతో సర్వే పూర్తి చేస్తే పెగ మార్కింగ్ తో పాటు డి.జి.ఆర్ .ఎస్. చేయాలని సూచించారు. కొండపోచమ్మ జలాశయం నుండి ఈ యాసంగిలో రామాయంపేట, చిన్న శంకరంపేట్ మండలాలలోని కొన్ని ఎకరాలకైనా సాగు నీరందించేలా కృషి చేయాలని ఏజెన్సీలను కోరారు. ఈ సమావేశంలో నీటిపారుదల ఎస్ ఈ యేసయ్య, ఈ ఈ శ్రీనివాస్ రావు, డీ.ఈ.ఈ. శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఎస్ ఈ వేణు, ఈ ఈ నారాయణ్ రావు, ఆర్.డి.ఓ. లు సాయి రామ్, శ్యామ్ ప్రకాష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శశికుమార్, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, , తహసిల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బలరాం, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking