కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,
-మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది
-అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్.

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి మార్చి19

మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసిడిఎస్ హుజురాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. మహిళలు, గర్భిణీలు రక్తహీనత నివారణకు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. పప్పులు, కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. వీటి ద్వారా మంచి శక్తి వస్తుందని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. పెద్దలు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తద్వారా పిల్లలు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారని పేర్కొన్నారు. బయటి ఆహారం తీసుకోవడం తగ్గించాలని, ఇంట్లోనే బలవద్దకమైన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. గర్భిణీలు అంగన్వాడీ సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పైనే ఉంటుందని తెలిపారు.. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, న్యూట్రిషన్ ఫుడ్ ను తీసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటే వ్యాధులను పూర్తిగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు అన్నప్రసన చేయించారు. అలాగే పలువురు గర్భిణీలకు సామూహికంగా సీమంతం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఇయాజ్, అదనపు డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ చందు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎన్ వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్త ప్రశాంతి, ఎంపీడీవో భీమేష్, డిప్యూటీ తహసిల్దార్ రమేష్, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ నాగరాజు, సిడిపిఓ తిరుమల, మెడికల్ ఆఫీసర్లు చందన, వరుణ పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

– కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శన క్షేత్రాల పరిశీలన…

కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ప్రతి ప్రదర్శన క్షేత్రం దగ్గరకు వెళ్లి శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్మి కంపోస్టు, ఎర్రల ఎరువు తయారీ, చేపలు, కోళ్ల పెంపకంపై ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సీనియర్ శాస్త్రవేత్త ఎన్ వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్త ప్రశాంతి, ఆర్టీవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking