ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోం సీఎం హిమంత బిస్వశర్శ, ఎంపీ లక్ష్మణ్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా బైంసాలో కోమురంభీమ్ విజయ సంకల్ప యాత్రను అసోం సీఎం హిమంత బిస్వశర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాం రావు పాటిల్, పాయలశంకర్, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏలేటి మాట్లాడారు.అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, రానున్న లోక్ సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్యాంరటీలు, వారంటీల పేరుతో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు 2500, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలండర్ ఇలా ఓ ఒక్క హామీకి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారని చెప్పారు. వారి మోసం చట్ట సభ సాక్షిగా బయటపడ్డదని తెలిపారు.
యూపీఏ పాలనలో దేశంలో అక్రమాలు, అవినీతి, టూజీ స్కాంలు జరిగితే, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో అవినీతికి తావులేని అభివృద్ధిని చేసి చూపించిందని గుర్తు చేశారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బియ్యం, పేదలకు పక్కా ఇండ్లు, ఎన్ఆర్ఈజీఎస్, జాతీయ రహదారులు, పరిశ్రమలు, రైల్వేలు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఇలా అనేక పథకాలకు కేంద్రం ప్రభుత్వం లక్షల కోట్ల సాయం అందించిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
వికసిత భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీ గారి నాయకత్వంలోనే సకల జనులకు సంక్షేమం అందుతోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించిన ప్రజలు లోకసభ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించి ప్రధాని నరేంద్రమోడీగారికి బహుమతిగా ఇవ్వాలని కోరారు.