ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03 : మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వివక్షత ప్రదర్శిస్తున్న అధికార బీఆరెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించారు. మంగళవారం మున్సిపల్ ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా జరిపారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం కు చేరుకుని ఆందోళన జరిపారు. మంచిర్యాల లో నీటి కొరత ఉందని అభియోగిస్తూ ఖాళీ కుండాలను ప్రదర్శించిన అనంతరం వాటిని పగలకొట్టారు. మంచిర్యాలలో ఉన్న సమస్యలను ఏకరవు పెడుతూ మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ కు కౌన్సిలర్ లు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రావుల ఉప్పలయ్య, ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్,పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి మాట్లాడుతూ… పాలక పక్షం విపక్ష సభ్యుల పట్ల వివక్షత చూపుతూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. మంచిర్యాలలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో అధికార పార్టీ విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా చెందిన హామీలు ఏవి కూడా అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆందోళన అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం లో వినతిపత్రం సమర్పించారు.