ఇంద్రవెల్లిలో మరో రెండు గ్యారెంటీలు కృతజ్ఞత సభలో మంత్రి పొంగులేటి
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 1 (ప్రజాబలం) ఖమ్మం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)తో పొత్తు ఒక శాసన సభ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదని మున్ముందు కూడా తమ పొత్తు కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అనుబంధం పార్లమెంటు ఎన్నికలే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల్లోకొనసాగుతుందన్నారు గురువారం గడచిన శాసన సభ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన సిపిఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సిపిఐ జిల్లా కార్యాలయంకు పొంగులేటి వెళ్లారు. పేరు పేరున ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా నిరంకుశ పాలనను అంతం చేసేందుకు సిపిఐ త్యాగ పూరిత వైఖరి అవలంభించిందన్నారు. ఒక సీటుకే పరిమితమై విశాల దృక్పథంతో ఆలోచన చేసిందని పొంగులేటి తెలిపారు. ప్రతి నియోజక వర్గంలోను నిబద్దతతో సిపిఐ కార్యకర్తలు పని చేశారని తనకు రికార్డు స్థాయి మెజార్టీని అందించేందుకు విశ్రామించకుండా సిపిఐ కార్యకర్తలు పని చేశారని పొంగులేటి తెలిపారు. అవగాహనతో అన్ని ఎన్నికల్లో పనిచేసి మిత్ర బంధాన్ని కొనసాగిస్తామని అదే సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చే దిశగా పయనిస్తామన్నారు పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మంచి మెజార్టీతో గెలవడం శుభసూచికమన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం జరిగే సభలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని పొంగులేటి సూచన ప్రాయంగా తెలిపారు. నా పరిధిలో ప్రతి సిపిఐ కార్యకర్తకు తప్పక సాయం చేస్తానని కొన్ని సందర్భాలలో మేలు చేయలేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు. సిపిఐ కార్యకర్తలు చూపిన ఆత్మీయతను నిలబెట్టుకుంటానన్నారు. మంత్రి పొంగులేటిని సిపిఐ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా సహయ కార్యదర్శి దండి సురేష్, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మహ్మద్ జావిద్, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, శివరామకృష్ణ, పుచ్చకాయల కమలాకర్, పలువురు రాష్ట్ర సమితి సభ్యులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.