సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ రాజన్న
జగిత్యాల, ఏప్రిల్ 24: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని, గత మార్చిలో వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు హామీ ఇచ్చిన సీఎం మాట నిలబెట్టుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ రాజన్న కోరారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయారని మహంకాళి రాజన్న ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 24 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల నగదుతోపాటు వచ్చే సీజన్లో పూర్తి సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించాలని రాజన్న ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అలాగే ఇండ్లు దెబ్బతిన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. పిడుగుపాటుతో చనిపోయిన కుటుంబాలకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే గత మార్చిలో కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు 10 వేల రూపాయల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మాటను వెంటనే నిలబెట్టుకోవాలని మహంకాళి రాజన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినపెళ్లి కాశీ నాథం, బత్తుల కొండయ్య యాదవ్, కొండ శ్రీధర్, కోయ బాలకృష్ణ, నక్క లక్ష్మణ్, జున్ను మల్లయ్య, మాగ్గిడి గంగాధర్,గంగారెడ్డి, ఒరుగంటి భార్గవ్ రామ్, విజయ్ కుమార్ లు ఉన్నారు