దద్దరిల్లిన జన జాతర సభ.

 

ఫైనల్స్‌లో పౌరుషాన్ని ప్రదర్శించాలి

– సెమీ ఫైనల్స్‌లో కేసీఆర్ ను ఓడించాం.
– రిజర్వేషన్ల రద్దుకు పీఎం, హోం మంత్రి కుట్ర
– పార్లమెంటులో తెలంగాణను అవమానిస్తున్నపుడు బండి మౌనం
– గుండు, అరగుండును పక్కనపెట్టండి
– వెలిచాల రాజేందర్‌రావు‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలి
– జమ్మికుంట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఏప్రిల్ 30

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమిఫైనల్స్‌ కాగా అందులో కేసీఆర్‌ను ఓడించిన ప్రజలు ఫైనల్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించాలని, కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన ‘జన జాతర’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అధ్యక్షతన జరిగిన మీటింగులో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ స్వాగతోపన్యాసం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య లీడర్లు, ప్రజాప్రతినిధులు వేదికను అలంకరించారు. సభకు జనం అశేషంగా హాజరయ్యారు.

హుజూరాబాద్‌కు అండదండలివ్వాలని సీఎంకు ప్రణవ్ విజ్ఞప్తి..
కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ స్వాగతోపన్యాసంలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వ అండదండలు కావాలని సీఎం ను కోరారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు.
దేవాలయాల గురించి చెప్పుకునే బండి సంజయ్ కనీసం మొన్న పార్లమెంట్ పరిధిలో జరిగిన ఇల్లందకుంట రామాలయంలో రాములోరి కల్యాణానికి రాలేదని చెప్పారు. విపరీతమైన ఎండను సైతం లెక్క చేయకుండా సభకు వచ్చిన కాంగ్రెస్ అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం జరిగే పార్లమెంటు ఎన్నికలు మన భవిష్యత్‌కు సంభందించిన ఎన్నికలని, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎలక్షన్స్ అని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని,
దేశంలో న్యాయం జరగాలంటే కాంగ్రెస్ రావాలని ఆకాంక్షించారు. శాసన సభ ఎన్నికల్లో జరిగిన మార్పు ఈ ఎన్నికల్లో కూడా ఉండాలని ప్రజలను కోరారు. మటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. 6 గ్యారెంటీలలో ఇప్పటికే కొన్నింటినీ అమలు చేశామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్ సౌకర్యం అమలు చేశామని గుర్తుచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోనిబిజిగిరి షరీఫ్, హుజురాబాద్ చర్చిలను అభివృద్ధి చేయాలని, దానికి రేవంత్ రెడ్డి సహకారం కావాలని కోరారు.

కాంగ్రెస్ పాలనలోనే రామరాజ్యం:
అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ సెగ్మెంట్ లో తొలిసారి ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్యుడి నడ్డీ విరిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రామరాజ్యం సాధ్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాల చొప్పున పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 20 లక్షల ఉద్యోగాలు కల్పించారని వివరించారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి తొలగింపునకు కారణమేంటో చెప్పాలి:
మంత్రి పొన్నం ప్రభాకర్.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు అందాయన్నారు. బండి సంజయ్ తరుచూ వివాదాస్పద అంశాలే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఏ కారణం చేత తొలగించారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని మంత్రి పొన్నం కోరారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రముఖ గాయకుడు నల్లగొండ గద్దర్(నరసన్న) అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ప్రచారం కోసం రాసిన ‘కదులు కదులు’ పాట సీడీని ఆవిష్కరించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సంప్రదాయానికి మాయని మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయోధ్య రామాలయంలో కల్యాణం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. దేవుడి బొమ్మలతో ప్రచారానికి వస్తున్న నిజామాబాద్, కరీంనగర్ అభ్యర్థులు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ కుమార్ లను పక్కనపెట్టాలన్నారు. వాళ్లు గుండు, అర గుండు అని ఆరోపించారు. పోరాటాల గడ్డ కరీంనగర్ జిల్లా అని తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమానికి ఊపిరిలూది స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన చరిత్ర జిల్లాకు ఉందని గుర్తుచేశారు. ఈ జిల్లా నుంచి ఎం.సత్యనారాయణ రావు, చొక్కా‌రావు వంటి లీడర్లు పేద ప్రజల కోసం పోరాడిన ఘన చరిత్ర కలిగి ఉన్నారని వివరించారు. నరేంద్ర మోడీ పార్లమెంట్ లో తెలంగాణను అవమాన పరిచినప్పుడు బండి సంజయ్ మౌనం వహించారని చెప్పారు.

ఐదేండ్లలో బండి సంజయ్ ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున 25 కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి ‘గాడిది గుడ్డు’ను మాత్రమే తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయక పక్కన పెట్టారన్నారు. 400 వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరణ చేసేందుకు ప్రధాని, హోం మంత్రి కుట్రలు పన్నుతోందని తీవ్రంగా దుయ్యబడ్డారు. కేసీఆర్ కారు కరాబై జుమ్మేరత్ బజార్ కు రిపేర్ కు వెళ్లిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చెరుకు సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, మిల్కూరి వాసుదేవ రెడ్డి టీజేఎస్ లీడర్లు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking