వరంగల్ ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 17:
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ లక్షకు పైగా బ్యాంక్ లావాదేవీల వివరాలు సమర్పించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య బ్యాంక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిసిపి రవీందర్ తో కలిసి కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలోని బ్యాంకర్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున బ్యాంకర్లు నియామవళిని
ఖచ్చితంగా పాటించాలని అన్నారు.
ఎవరైనా బ్యాంక్ ఖాతాలో ప్రతి రోజు లక్ష రూపాయల నగదు డిపాజిట్ చేసిన, విత్ డ్రా చేసినా,అదే విధంగా నెలలో 10 లక్షలు పైబడి నగదు డ్రా చేసిన గానీ లేదా ట్రాన్స్ఫర్ చేసిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల వివరాలను ప్రతి రోజు ఆయా బ్యాంక్ అధికారులు ఎన్నికల అధికారులకు అందించాలని కోరారు.
ఆన్ లైన్ లో జరిగే లావాదేవీలపై గట్టి నిఘా పెట్టాలని అన్నారు
అలాగే ఓటర్లను ప్రలోబాలకు గురి చేయుటకు గాను ఒకే అక్కౌంట్ తో వివిధ అక్కౌంట్లకు యు.పి.ఐ. ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ ల ద్వారా డబ్బులు జమ చేసినచో వాటి వివరాలను కూడా పంపించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే, జాప్యం చేయకుండా వెంటనే చెక్ బుక్ జారీ చేయాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించాలని , ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి పుష్ప లత, జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవ్ రెడ్డి, లీడ్ బాంక్ మేనేజర్ రాజు, ఎస్బిఐ, సిబిఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, లీడ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్ తదితర బ్యాంకుల చీఫ్ మేనేజర్లు, ఎంజీఎం లు, బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.