కూకట్పల్లిలోని జేఎన్టీయూలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, రిసెప్షన్ , టెంపరరీ స్ట్రాంగ్రూమ్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ప్రజాబలం 17 అక్టోబర్:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లా పరిధి కూకట్పల్లిలోని జేఎన్టీయూలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్,టెంపరరీ స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ , రిటర్నింగ్ అధికారి కార్యాలయం, పోలింగ్ కేంద్రాలనుఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు తప్పనిసరిగా కల్పించాలని, బూత్ లెవల్ అధికారుల సమన్వయంతో ర్యాంప్, మంచినీరు, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా క్షేత్రస్థాయిలో పోలింగే కేంద్రాలను తనిఖీ చేసి వసతులు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్క్యాస్టింగ్ కోసం సరైన విద్యుత్తు సౌకర్యం ఉండేలా చూడాలని, సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి శ్యామ్ప్రకాశ్, ఈఆర్వో రమేష్, ఎఈ ఆర్ ఓ లు ఆయా శాఖల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.