ధార్మిక భవనాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి.

3 కోట్ల అంచనా వ్యాయంతో వరంగల్లో నిర్మించిన జోనల్ కార్యాలయం.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 21:

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్లతో కలిసి దేవాదాయ, ధర్మాదాయ వరంగల్ జోన్ కార్యాలయానికి గురువారం పూజలు చేసి ప్రారంభించారు.కార్యాలయ భవనము ఆవిష్కరణకు విచ్చేసిన మంత్రులు, శాసన సభ్యులు తదితరులందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ, వరంగల్ జోన్ డిప్యూటి కమీషనర్ టి. శ్రీకాంతారావు సహాయ కమీషనర్ ఆర్. సునీత పూలమాలు వేసి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. పండుగ వాతావరణంలో వినయ భాస్కర్ సబ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ పాత సెంట్రల్ జైలుకి ఎదురుగా జిల్లా కలెక్టర్ కేటాయించిన 1074 చ॥ గజముల ప్రభుత్వ స్థలములో ఈ భవన నిర్మాణం 4.5 కోట్ల వ్యయముతో ప్రజలకు అత్యంత సౌకర్యంగా, సుందరంగా ఈ భవన నిర్మాణం దేవాదాయ ధర్మాదాయ శాఖ, వరంగల్ డిప్యూటీ కమీషనర్ టి. శ్రీకాంతారావు, రామల సునీత వరంగల్ ఉమ్మడి జిల్లాల అసిస్టెంట్ కమీషనర్ ఎంతో శ్రద్ధతో పటిష్టంగా, సుందరంగా, ఈ కార్యాలయాన్ని వ్యక్తిగత శ్రద్ధతో అతి తక్కువ సమయంలో నిర్మాణం జరిపించారని అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎర్పడ్డాక కె.సి.ఆర్ ఆధ్వర్యవంలో ప్రభుత్వం యొక్క ప్రతీ శాఖ తమ ప్రతిభను చాటుతూ ప్రజలకు మరింత దగ్గరవుతుందని అధికారులు కూడా సమయాన్నికూడా లెక్కజేయకుండా ఎక్కువగా శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం అభినందనీయమని తెలిపారు. ధూప దీప నైవేద్యాన్ని రూ॥2,500ల నుండి రూ॥ 6,500లకు ఇటీవల రూ॥ 10,000లకు పెంచడమే కాకుండా అర్చకులకు ప్రభుత్వ ఖజానానుండి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వడం దేశం మొత్తంలో ఈ రాష్ట్రానికే చెల్లిందని మంత్రి తెలిపారు.
. సభాధ్యక్షత వహించిన దాస్యం వినయభాస్కర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ భద్రకాళీ ఆలయానికి 30 కోట్లు మాడవీధుల నిర్మాణం నిమిత్తం మంజూరు చేయడం జరిగిందని, సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొంది శాంతి సామరస్యాలతో సమాజం వర్ధిల్లే విధంగా జరిపే కృషిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇతోదికమైన తోడ్పాటును అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయితీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో వల్మిడి, పాలకుర్తి, బమ్మెర మూడు పక్క పక్క గ్రామాలలో శ్రీమద్రామాయరణ కర్త ఆదికవి వాల్మీకి, తెలుగు సాహితీవేత్త పాల్కుర్కి సోమనాథుడు, శ్రీమదాంధ్రమహాభాగవతకర్త శ్రీ బమ్మెర పోతన జన్మించిన స్థానాలలో వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా దిద్దడంతోపాటు సుందరభవ్య రామాలయ నిర్మాణం కూడా జరుపబడిందని ప్రజలు ఈ క్షేత్రాలను దర్శిస్తూ స్వాంతన పొందడమే కాకుండా అధ్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని ఇందుకు దేవాదాయ శాఖ వారి తోడ్పాటు చాలా అవసరమని తెలిపారు. అనంతరం సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణా రాష్ట్రంలో మరుగున పడివున్న పుణ్యక్షేత్రాలను వెలికితీసి వందల కోట్లతో కె.సి.ఆర్ అభివృద్ధి జరుపడమేగాక దేశం మొత్తంలోలేని తీర్థాలు, క్షేత్రాలు, పారాణిక, చారిత్రక ప్రదేశాలను దేశ ప్రజలకు చాటుతూ తెలంగణాకు భారతదేశం నలుమూలల నుండి యాత్రికులు తెలంగాణాని సందర్శించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచి సకల జనుల జీవన ప్రమాణస్థాయిని పెంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వరంగల్ తూర్పు ఎం.ఎల్.ఏ నన్నపునేని నరేందర్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కార్పోరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్, తెలంగాణా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్, వి. అనిల్కుమార్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, వరంగల్ జోన్ లోని వివిధ జిల్లాల సహాయ కమీషనర్లు, వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారులు, సిబ్బంది, అర్చకులు, వేదపండితులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking