ప్రజాబలం మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ 20 : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో ముఖ్య ప్రణాళిక అధికారి జి.సత్యంతో కలిసి పంచాయతీ రాజ్,రోడ్లు-భవనాల శాఖల అధికారులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువలు, అంతర్గత రహదారులు,సెప్టిక్ ట్యాంక్లు,కల్వర్టులు, ప్రహారీగోడలు,గ్రేవల్ రోడ్లు,కమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారులతో సమీక్షించి ప్రతి రోజు పనుల పురోగతిని పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి రోజు పనులను పరిశీలించి నివేదిక అందించాలని,ఈ నెల 31వ తేదీ లోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పనులు త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత గుత్తేదారులకు ఆదేశాలు ఇవ్వాలని, ప్రారంభం కాని పనులను త్వరగా ప్రారంభించాలని, టెండర్ స్థాయిలో ఉన్న పనులకు త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.గుత్తేదారులు,సామాగ్రి,దినసరి కూలీలు ఇతర ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈ.ఈ.ఎం. స్వామిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.