కలెక్టర్ ను కోరిన పొల్సాని సుగుణాకర్ రావు
జగిత్యాల ప్రతినిధి, మార్చి 28:(ప్రజా బలం) కోరిన కోర్కెలను తీర్చే కొండగట్టు అంజన్న సన్నిధిలో సమస్యలు తిష్ఠవేసి ఉన్నాయని చిన్న, పెద్ద హనుమాన్ జయంతి రానున్న నేపథ్యంలో సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పొల్సాని సుగుణాకర్ రావు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. అనంతరం ఆయన జగిత్యాల లో మాట్లాడుతూ గత ఇదేండ్లుగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ పరిరక్షణ పేరిట ఆలయ అభివృద్ధికి పోరాడుతున్నామన్నారు. ఆలయ అభివృద్ధి, సౌకర్యాల కల్పన వంటి విషయాలపై పలుమార్లు ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశామన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలని భజన, యాగం, మౌన ప్రదర్శనతో పాటు ఉద్యమ కార్యాచరణ చేపట్టామన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజురైన నేపధ్యంలో రానున్న చిన్న, పెద్ద హనుమాన్ జయంతి లకు లక్షలాది మంది భక్తులు రానున్నారని సుగుణాకర్ రావు పేర్కొన్నారు. వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచి నీళ్లు, స్నానాల గదులు, పందిళ్లు, మహిళలకు బట్టలు మార్చుకునే గదులు, రాత్రి బసచేసే తాత్కాలిక వసతి గృహాలు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, రవాణా సౌకర్యాలు, భోజనం, అల్పాహారం, రక్షణ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే కొండగట్టు ను గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీ భూములను దేవాలయ సంస్థ పరిధిలోకి తీసుకొనిరావాలని, భక్తులకు వసతి, భోజన, కల్యాణ మండపాలు, రిజర్వాయర్లు, రోడ్లు వంటివాటితోపాటు పలు అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేసి హామీ ఇచ్చిన విధంగా సకాలంలో పనులను పూర్తి చేయించాలని కోరారు. నిధుల కేటాయింపులో ఆలస్యం జరిగితే కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపడతామని పొల్సాని సుగుణాకర్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ పరిరక్షణ సమితి జాయింట్ కన్వీనర్ మోటకాడి మోహన్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ లింగంపల్లి శంకర్, రాజయ్య, నటరాజ్, గంప జగన్, నరేందుల శ్రీనివాస్, విజయ్ తోపాటు పలువురు ఉన్నారు.