జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 3:
ధరణి సమస్యల పరిష్కారానికి నూతన ఆర్.ఓ.ఆర్. బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ
ధరణి పెండింగ్ దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్.ఓ.ఆర్ ముసాయిదా బిల్లు-2024 పై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్సైట్ (www.ccla.telangana.gov.in) ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ప్రజలు ఎవరైనా సరే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చని అన్నారు. సలహాలు, సూచనలను ఈ మెయిల్ (ror2024-rev@telangana.gov.in) ద్వారా తెలుపవచ్చని సూచించారు. పోస్ట్ ద్వారా కూడా ‘ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001’ చిరునామాకు పంపించవచ్చని తెలిపారు.
అనంతరం ఆయా మండలాల తహశీల్దార్లకు కలెక్టర్ గౌతమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని, సీ.సీ.ఎల్.ఏ కమిషనర్ సూచనల మేరకు వీలైనంత త్వరగా పెండెన్సీ పూర్తి చేయాలని సూచించారు. తహసిల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం పది రోజుల్లోపు క్లియర్ చేయాలని గడువు విధించారు. సక్సేషన్, పెండింగ్ మ్యూటేషన్ వంటి దరఖాస్తులను రికార్డులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వెనువెంటనే పరిష్కరించాలని అన్నారు. మండలాల వారిగా పెండింగ్ దరఖాస్తులను రివ్యూ చేసుకోవాలని, సుదీర్ఘ కాలం నుండి పెండింగ్లో ఉన్న వాటిని ముందుగా పరిశీలన జరిపి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా పరిశీలన జరపాలని ఆర్డీఓలకు సూచించారు. వక్స్ భూములు , ఇనాము భూములు , డిఫెన్సె భూములు నిషేధించబడిన భూములలో ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడునని తెలియజేసారు.
కాగా, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరుగుతోందని, వీటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. అర్జీల పరిష్కారానికి చేపట్టిన చర్యలను తెలియజేస్తూ ఆన్లైన్ లో అప్లోడ్ చేసే సమయంలో వివిధ అంశాలను సవివరంగా పేర్కొనాలని అన్నారు. ఏదైనా అర్జీని తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను సహేతుకంగా పొందుపర్చాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు విజేందర్ రెడ్డి , సంబంధిత అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.