ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ధాన్య కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్య కొనుగోలుకు 231 కేంద్రాలు ప్రతిపాదించి, మంగళవారం నాటికి 226 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. 93 కేంద్రాల్లో కొనుగోళ్లు జరిపినట్లు, ఇప్పటికి 18505.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన అన్నారు. రైస్ మిల్లుల తనిఖీలు చేపట్టి, సిఎంఆర్ ఎంత, ఇతరాలు ఎంతమేర ఉన్నవి చూడాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ధాన్య కొనుగోళ్ళను పరిశీలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ దశలోనూ ఆలస్యం చేయకూడదని, కొన్న ధాన్యాన్ని నమోదులు పూర్తి చేసి, వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆయన తెలిపారు. ఓబిఎంఎస్ నమోదులు త్వరితగతిన పూర్తిచేసి, రైతులకు ధాన్యం డబ్బులు అందేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. గత సంవత్సరంలో ఇదే సమయంలో ఎంతమేర సేకరించింది, ఇప్పుడు ఎంత సేకరించింది పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు ఈ సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, అదనపు డిఆర్డీవో జయశ్రీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
