ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దివ్యానగర్ లోని జగదాంబ ఆలయ ప్రాంగణంలో సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, రామారావు పాటిల్, అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ లతో కలిసి కలెక్టర్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో జన్మించారని, ఈ సందర్బంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, ఫిబ్రవరి 15 న సెలవు ప్రకటించిందని అన్నారు. సామజిక దురాచారాలను నిర్ములించడంతో పాటు ప్రజల మేలుకోసం సేవాలాల్ ఎన్నో ఉద్యమాలు చేసారని వివరించారు. బంజారాల కుటుంబాలలో వెలుగులు నింపిన సేవాలాల్ చిరస్మరణీయులని, అహింస మార్గంలో ప్రేమానురాగలను పంచుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు. బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేయడం జరుగుతుందని వివరించారు. మారుముల గిరిజన గుడాలు, తాండాలలో విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. యువత చదువునే ఆయుధంగా మలచుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కోరారు.
స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ మహనీయుడని అయన ఆశయాల సాధనకు, బంజారాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మారుమూల గిరిజన తాండాల రహదారులకు 100 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టనున్నామని తెలిపారు. ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్ల నిర్మాణంతో పాటు జిల్లా కేంద్రంలో ఆడిటోరియం, బంజారా భవన్ అలాగే గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలకు కృషి చేస్తానన్నారు.
ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, బంజారాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనీ సూచించారు. పొడుభూముల పట్టాలు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగదాంబ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పాటు అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ముధోల్ శాసనసభ్యులు మాట్లాడుతూ, సేవాలాల్ జయంతి సందర్బంగా బంజారా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సన్మార్గంలో నడవాలని కోరారు.
అంతకుముందు బంజారాల సంస్కృతీ సాంప్రదాయాలతో మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నాకళ్యాణి, డిఆర్ డిఓ విజయలక్ష్మి, డిటి డిఓ అంబాజీ, సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు తుకారం, సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.