ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందికి ప్రశంసాపత్రాల జారీకి ప్రతిపాదనలను అందించాలి
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) ఖమ్మం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారని అన్నారు. ఉదయం 9.00 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా జరిగే జిల్లా స్థాయి వేడుకలో జాతీయ సమైక్యతను తెలియజేస్తూ 3 కల్చరల్ ప్రోగ్రాం లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారికి తెలిపారు గణతంత్ర వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా చేయాలని ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కు ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, దీనిని అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు జనవరి 26 నుంచి నూతనంగా ప్రారంభమయ్యే పథకాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నమూనాను స్టాల్ లో ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళా శక్తికి సంబంధించిన స్టాల్ ను గ్రామీణ అభివృద్ధి అధికారి సిద్దం చేయాలని అన్నారు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ప్రతిపాదనలు పంపాలని, ఈ జాబితాలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు కూడా పంపాలని, వరదల సమయంలో బాగా పని చేసిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందేలా చూడాలని, స్వాతంత్ర్య సమరయోధులకు వాహనాలు ఏర్పాటు చేసి వేడుకలలో పాల్గొనేలా చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ గణతంత్ర వేడుకలకు అవసరమైన మేర త్రాగునీటి క్యాన్లు ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని తెలిపారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం పాఠశాల విద్యార్థులను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ విద్యాశాఖ అధికారికి సూచించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డి.ఆర్.ఓ. రాజేశ్వరి, ఆర్డీఓ నరసింహారావు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు