ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను శరవేగంతో పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు, ఏజెన్సీలకు సూచించారు.
ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను శరవేగంతో పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు, ఏజెన్సీలకు సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి లతో మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, బ్లాక్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో 1,072 ఇండ్ల నిర్మాణం చేపట్టగా ఇంతవరకు 561 గృహప్రవేశాలు జరిగాయని, నిర్మాణాలు చివరి దశలో ఉన్న మరో 404 గృహాల పనులకు కూలీలకు అధిక సంఖ్యలో పెట్టుకొని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. పునాది, బ్రిక్ స్థాయిలో ఉన్న మిగతా నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. జర్నలిస్టు ఇండ్ల మధ్య నిర్మిస్తున్న డ్రైనేజి పనులు త్వరితగతిన పూర్తి చేసి రోడ్డును చదును చేయాలని అన్నారు. నిర్మాణాలు పూర్తైన వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించుటకు గాను నిధులు మంజూరు చేస్తామని, వెంటనే ప్రతిపాదనలు పంపవలసినదిగా సూచించారు. కాగా రామాయంపేట లో 304 ఇండ్లు, నిజాంపేట మండలం కల్వకుంట్ల, చెల్మెడ, నందిగామలో నిర్మాణంలో ఉన్న 152 ఇండ్లను కూడా ఈ నెలాఖరు నాటికీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పాపన్నపేట మండలం బాచారం నిర్మిస్తున్న 72 ఇండ్ల సివిల్ పనులను మార్చి నాటికి పూర్తి చేసి , అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. నాణ్యతలో రాజీపడవద్దని, లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ ఈఈ పాండురంగా రావు, మునిసిపల్ కమీషనర్ జానకిరామ్ సాగర్, తహశీల్ధార్ శ్రీనివాస్, ఏజెన్సీ పాల్గొన్నారు.