రాజన్న సిరిసిల్ల జిల్లా,
01 జులై 2024 ,
ప్రజాబలం ప్రతినిధి ,
సిరిసిల్ల పట్టణంలోని పలు ముంపు ప్రాంతాల్లో వర్షాలతో వచ్చే వరద నీటి ద్వారా ప్రజలకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సిరిసిల్ల లోని శ్రీ నగర్ కాలనీ, శాంతి నగర్, పద్మనగర్లో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య తో కలిసి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సోమవారం ఉదయం పరిశీలించారు.
పద్మనగర్ ఈటీపీ నుంచి శ్రీనగర్ కాలనీ, శాంతి నగర్ ప్రాంతాల మీదుగా మానేరులో వరద నీరు కలిసి స్థలాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. వర్షాలతో వచ్చే వరద ముంపుతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పక్కా ప్రణాళికతో పనులు చేయాలని ఆదేశించారు. నాళాల్లో ఎలాంటి చెత్త లేకుండా చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, డీవైఈ ఈ ప్రసాద్, ఏఈ స్వామి, టెక్నికల్ ఆఫీసర్ వెంకటేష్, టీపీ ఎస్ లు వినయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.