చిన్నారి నయనశ్రీ వైద్యానికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్
మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,
2 ఆగస్టు 2024 ,
ప్రజాబలం ప్రతినిధి,
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్-శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆచిన్నారి వైద్య చికిత్సకు సంపూర్ణ మద్దతు అందించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.శుక్రవారం ఆయన వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని చిన్నారి ఇంటిని సందర్శించారు. చిన్నారికి వచ్చిన క్యాన్సర్ వ్యాధి, చికిత్స నిమిత్తం ఇప్పటికే తల్లిదండ్రులు 3 లక్షల రూపాయలను అప్పుచేసి ఖర్చు చేశారని తెలుసుకొని.చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. వీర్నపల్లి మండల తహసిల్దార్, చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించిన వెంటనే అందులో వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు తెలిపారు.చిన్నారికి ఉన్న క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు . డీఎంహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం చిన్నారి చికిత్స ప్రారంభించాలని, బ్యాంకు లో జమ చేసిన నిధులు చికిత్స కోసం వినియోగించాలని పేర్కొన్నారు.
చిన్నారి చికిత్స కోసం అవసరమైతే మరిన్ని నిధులను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని, తల్లిదండ్రులు ఎటువంటి బెంగ అవసరం లేదని, చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం ఏ సమయంలో నైనా, ఎలాంటి సహాయం అవసరం ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.
అనంతరం తిరిగి సిరిసిల్ల మార్గ మధ్యలో రంగంపేట వద్ద చెట్లు నరుకుతున్న వారి పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా చెట్లు, కొమ్మలు నరకడం ఇక పై పునరావృతం కావద్దని, మొక్కలు నాటే సమయంలోనే విద్యుత్ వైర్లకు దూరంగా నాటాలని, విద్యుత్ తీగలు చెట్ల పైకి రాకుండా చూసుకుని మొక్కలు నాటాలని ఆదేశించారు.