ఈనెల 5 నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
శుక్రవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛ దనం-పచ్చదనం కార్యక్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 5 నుండి 9వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ దనం-పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రోజువారిగా ప్రణాళికలను రూపొందించుకొని వివిధ కార్యకలాపాలను చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో స్వచ్ఛత, పరిశుభ్రత,మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం వంటి విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం తొలి రోజు గ్రామీణ స్థాయిలో గ్రామ కమిటీలు,పట్టణ స్థాయిలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కమిటీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా స్వయం సంఘాల సభ్యులు, యువకులను సభ్యులుగా చేసి, విసృతంగా సమావేశాలు ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. యువత,విద్యార్థులు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లను వాలిటంర్లుగా నియమించి శ్రమదాన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలను తెలియజేసే విధంగా గోడలకు పెయింటింగ్స్ వేయించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలలో పారిశుద్ధ్యం నిర్వహించడం,నీటి శుభ్రత వంటి విషయాలపై రోజువారి కార్యచరణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించి నిర్మాణానికి 15-20 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛ ధనం.పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విస్తృతస్థాయిలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో నిరంతరం పారిశుద్ధ్య పనులను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలోప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా గుంతలను పూడ్చాలని,వర్షాలు కురుస్తున్నందున నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో ఆయిల్ బాల్స్,బ్లీచింగ్ పౌడర్ ను వేయాలన్నారు.దోమల నివారణ రసాయనాలను పిచికారీ చేయాలని తెలిపారు.దోమలను పెరగకుండా నియంత్రించి, కాలానుగున వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ దనం-పచ్చదనం కార్యక్రమం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహన పెంచేలా విద్యార్థులచే ఉపన్యాస,వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలచే కాలానుగుణ వ్యాధుల నియంత్రణ,నివారణ చర్యలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వారిని ఖాళీ చేయించాలన్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున, వాటికి నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి,డీఆర్డీవో విజయలక్మి, జెడ్పి సీఈవో గోవింద్,డీపీవో శ్రీనివాస్, చీప్ ప్లానింగ్ అధికారి బాబు రావ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారులు, మునిసిపల్ శాఖ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.