ఖమ్మం ప్రతినిధి జనవరి 9 (ప్రజాబలం) ఖమ్మం విద్యుత్ కనెక్షన్లు లేని గృహాలకు కనెక్షన్లు ఇచ్చేలా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ అధికారులతో గృహజ్యోతి, మిషన్ భగీరథ, గిరివికాసం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లను విద్యుత్ కనెక్షన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రజాపాలన అభయహస్తం క్రింద దరఖాస్తుల స్వీకరణ చేసినట్లు తెలిపారు. స్వీకరించిన దరఖాస్తుల్లో కొన్నింటికి విద్యుత్ సర్వీస్ మీటర్ నెంబర్ పొందుపర్చలేదని తెలిపారు. సర్వీస్ కనెక్షన్ పొందుపర్చక పోవడానికి కారణాలు విశ్లేషించాలన్నారు. ఒకే ఇంటిపై రెండు కనెక్షన్లు ఉన్నవా, విద్యుత్ కనెక్షన్ తీసుకోలేదా, కనెక్షన్ తీసుకొని ఏ కారణం చేతనైన మీటర్ రద్దు అయిందా కారణాలు తెలుసుకోవాలన్నారు. బ్లాంక్ దరఖాస్తులపై సదరు దరఖాస్తుదారులతో మాట్లాడి తగుచర్యలు తీసుకోవాలన్నారు. బిల్ స్టాప్ కనెక్షన్ల విషయమై, వినియోగదారులతో సెటిల్ చేసుకొని, క్రొత్త మీటర్ కు దరఖాస్తు చేయించాలన్నారు. ఇంటి నెంబర్ ఉండి, ఇల్లు పేరు తండ్రి, కుటుంబీకుల పేరుతో ఉన్న కారణంగా మీటర్లు ఇవ్వనిచోట, వెంటనే మీటర్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ క్రింద సత్తుపల్లి పట్టణ ప్రాంతానికి తొగుట నుండి నీటి సరఫరా ఉండగా, రామచంద్రపురం, గందుగులపల్లి ల వద్ద సంప్ లు ఉండగా, విద్యుత్ సమస్యల కారణంగా త్రాగునీటి సరఫరాపై ఇబ్బందులు ఉన్నాయన్నారు. చింతకాని, చిన్నమండవ, జాలిముడి, జమలాపురం సీపీడబ్ల్యూ పథకాలను పునరుద్ధరణకు విద్యుత్ చార్జీల ఏరియర్స్ పై తగుచర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు జాయింట్ తనిఖీలు చేసి, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గిరివికాసం క్రింద జిల్లాలో 271 యూనిట్లకు విద్యుత్ కనెక్షన్ల కొరకు ఫీ చెల్లించగా, 261 కనెక్షన్లు ఇచ్చినట్లు, మిగతా కనెక్షన్లు వెంటనే ఇవ్వాలన్నారు. జిల్లాలో 67 పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు లేనట్లు, అట్టి పాఠశాలలు సందర్శించి,త్వరితగతిన విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. జిల్లాలో 958 అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు ఉండగా, 236 కేంద్రాలకు విద్యుత్ మీటర్లు ఉన్నట్లు, మిగతా కేంద్రాలకు వారం రోజులలోపు విద్యుత్ మీటర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 500 పాఠశాలలకు సోలార్ ప్యానెళ్ళు ఉన్నట్లు, వాటిని ర్యాన్డంగా పరిశీలించి, పనిచేయుచున్నావా, నెట్ మీటర్ బిల్లింగ్ అవుతుందా నివేదిక సమర్పించాలన్నారు. హై బిల్లింగ్, అబ్ నార్మల్ బిల్లింగ్ లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో క్రొత్తగా 56 హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం చేస్తున్నట్లు, ఇప్పటికి 14 చోట్ల విద్యుత్ మీటర్ల కొరకు అప్లై చేయగా, 11 చోట్ల మంజూరయినట్లు, మిగతా చోట్ల ఆరోగ్య శాఖవారికి అవగాహన కల్పించి, త్వరితగతిన విద్యుత్ మీటర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఇ కె. రమేష్, మిషన్ భగీరథ ఎస్ఇ సదాశివకుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, విద్యుత్ శాఖ డిఇ లు బాబురావు, రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు, రాములు, ఎస్ఏఓ శ్రీధర్, ఏఇలు తదితరులు పాల్గొన్నారు