ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా చదువు సాగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం న్యాయమూర్తి స్థానిక త్రివేణి పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో విద్యార్థులకు వివిధ చట్టాంశాలను వివరించిన న్యాయమూర్తి బాల్యవివాహాలు వరకట్నము బాల కార్మిక వ్యవస్థ తదితర దురాచారాలు బాలల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయన్నారు. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా వ్యవహరించాలనే సామెతను ఉటంకించిన న్యాయమూర్తి విద్యార్థులు కేవలం చదువుపైనే తమ దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. చదువుకునే దశలో విద్యార్థు లు సెల్ ఫోన్లు వంటి వాటిని అతిగా ఉపయోగించకూడదని దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. చిన్నప్పుడు తాను జాతీయ జెండాను ఎగురవేయాలని మరియు ఆకు పచ్చ ఇంకు పెన్ను వాడాలనే లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా కృషి చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జెడ్జి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా న్యాయవాదులు ఇమ్మడి లక్ష్మీనారాయణ సింగం జనార్ధన్, పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు