– సహారా ఇండియా ఏజెంట్లు, ఖాతాదారులు
– జమ్మికుంట ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 6
తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సహారా ఇండియా ఏజెంట్లు, ఖాతాదారులు కోరారు. జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెంటనే తమ డిపాజిట్ సొమ్ము చెల్లించాలన్నారు. సహారా సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారని, సుప్రీంకోర్టు వడ్డీతో సహా బాధితులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. సెంట్రల్ రిజిస్టర్ కోపరేటివ్ సొసైటీ ద్వారా దేశంలోని ప్రతి ఖాతాదారునికీ చెల్లింపులు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా గతేడాది జూలైలో ప్రకటించారని గుర్తుచేశారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సహారా ఖాతాదారులు ఎవరూ డబ్బులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని మాట్లాడారని, అలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాటలను ఖండిస్తున్నట్టు వెల్లడించారు. సహారా ఇండియాకు ప్రతి ఇంటి నుంచి వినియోగదారులు ఉన్నారని వివరించారు. 46 ఏండ్లుగా సంస్థ ఉందని పేర్కొన్నారు. సహారా సంస్థ నుంచి డబ్బులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. సహారా సంస్థకు 13 కోట్ల ఖాతాదారులు ఉన్నారని చెప్పారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబ్బులు చెల్లిస్తామని పేర్కొని సీఆర్ సీఎస్ రీఫండ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారని, కానీ అందులో సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయని వివరించారు. వేటినీ ధ్రువీకరించడం లేదని అందులో డిఫ్యూషన్స్(తప్పులు) ఉన్నాయని పేర్కొంటున్నారని తెలిపారు. 2023 మార్చి 31 కంటే మెచ్యూరిటీ అయిన వాళ్లు రిఫండ్ కోటా ఉన్న వాళ్లు అప్లయ్ చేసుకున్నామని కానీ, న్యాయం జరగలేదని పేర్కొన్నారు. వెంటనే
పోర్టల్‌ను సవరించాలన్నారు. పోర్టల్, సహారా వాళ్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సహారా ఇండియా సంస్థ డబ్బులు రూ.25 వేల కోట్లు కేంద్రప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయని చెప్పారు. తమ సంస్థకు విలువైన రూ.2 లక్షల కోట్లు ఆస్తులున్నాయని, వాటిని అవసరమైతే స్వాధీనం చేసుకొని తమకు న్యాయం చేయాలని సహారా ఖాతాదారులు కోరారు.
కార్యక్రమంలో ఎం.రమేశ్, శ్రీధర్, సాంబయ్య, ఎల్లయ్య, లక్ష్మీపతి, అనిల్, శ్రీనివాస్, సంపత్ ఏజెంట్లు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.