డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 03 (ప్రజాబలం) కామేపల్లి భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకిరి విముక్తి కోసం, జాకీర్దారుల నైజాం నిరంకుశ పాలన విముక్తి కొరకు సాయుధ పోరాటంలో దొరల తూటాలకు నేలకొరిగిన మొట్టమొదటి అమరవీరుడు, తెలంగాణ నిర్మాణ తొలి వేగుచుక్క దొడ్డి కొమరయ్య స్ఫూర్తి ద్వారానే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు.
ఈరోజు పండితాపురం గ్రామంలో దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి అమరవీరుడు దొడ్డి కొమరయ్యకు జోహార్లు అని నినదించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు- బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదంతో తెగింపుతో ఉక్కు సంకల్పంతో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని ప్రస్తుత జనగామ జిల్లా కడవెండి గ్రామంలో ఒక సామాన్య గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించాడని తెలిపారు. ఆనాటి నిజాం పాలనలో పటేల్ పట్వారిల దుర్మార్గులతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి, దొరల పాలనతో విసిగిపోయిన దొడ్డి కొమరయ్య ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గుతపల సంఘానికి అధ్యక్షత వహించి దొరల గడీల ముందు నుండి ఊరేగింపుగా వెళుతుంటే దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి, తల్లి జానకమ్మ ల అకృత్యాలకు వ్యతిరేకంగా నినదిస్తుంటే, రజాకార్లు జనం పైకి తుపాకీ కాల్పులు జరపడం జరిగింది. ఆ తుపాకి తూటాలకు ఎదురొడ్డి ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమరయ్య నేలకొరిగి రక్తాక్షరాలతో లిఖించి తెలంగాణకు నాంది పలికాడని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా చేయాలని, జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య జిల్లాగా నామకరణం చేయాలని, ట్యాంక్ బండపై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మల్లి బాబు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు నాయక్, మత్స్య శాఖ సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, చింతల పెద్ద వెంకయ్య, భానోత్ వీరనాగులు, గుగులోత్ కిషన్, మేకల మహేష్ బాబు, వెంకన్న, బాబు తదితరులు పాల్గొన్నారు