– ఉపాధ్యాయ వ్యవస్థలోకి రియల్టర్ వచ్చిండు
– టీచర్ల సంఘాలు టికెట్లు అమ్ముకుంటున్నాయి
– వంగమహేందర్ రెడ్డి డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నడు
– 10 వేల ఓట్లు కొని చట్టసభకు పోవాలనుకుంటున్నడు
– పీఆర్టీయూ అధ్యక్షుడు పదేండ్ల సర్వీస్ ఎందుకు వదులుకున్నడు?
– కరీంనగర్ స్థానం నుంచి కాకుండా నల్గొండ నుంచి ఎందుకు బరిలో ఉన్నడు?
– ఎందుకంటే ఇక్కడ టికెట్ అమ్ముకుంటే డబ్బులొచ్చినయ్.. వాటితో అక్కడ నిలబడ్డడు
– సంఘం స్థలం అమ్మినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి
– పీఆర్టీయూపై రఘోత్తం రెడ్డి సంచలన కామెంట్స్
– కేసీఆర్ నే లైన్ లోకి తెచ్చుకొని టీచర్ల సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడి
ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్: ఉపాధ్యాయ వ్యవస్థలోకి రియల్టర్లు, కార్పొరేట్లు వస్తున్నారని అలాంటి వారిని నమ్మొద్దని ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోత్తం రెడ్డి అన్నారు. పీఆర్టీయూ సంఘం టికెట్ అమ్ముకున్నదని, వంగ మహేందర్ రెడ్డి అనే అభ్యర్థి కోట్లు పెట్టి టికెట్ కొనుకున్నాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘రాజ్యాంగం ఉపాధ్యాయుల ప్రాధాన్యతను గుర్తించి చట్టసభలో స్థానం కల్పించింది. ప్రలోభాలతో ఈ స్థానం ద్వారా చట్టసభకు వెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యాయ వ్యవస్థలోకి రియల్టర్ వచ్చిండు. టీచర్ల సంఘాలు టికెట్లు అమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ నుంచి బరిలో ఉన్న వంగ మహేందర్ రెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. పూల రవీందర్ తన పదేండ్ల సర్వీసును, పీఆర్టీయూ అధ్యక్ష పదవిని వదిలి కరీంనగర్ నుంచి కాకుండా నల్గొండ నుంచి పోటీ చేయడానికి ఎందుకు వెళ్తున్నడు? ఎందుకంటే ఆయన పీఆర్టీయూ టికెట్ ను వంగ మహేందర్ రెడ్డికి అమ్ముకున్నాడు. ఆ డబ్బులతో నల్గొండ నుంచి పోటీ చేస్తున్నాడు. పోటీలో ఒకవేళ ఓడినా.. తన పీర్టీయూ అధ్యక్ష పదవిలో ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా పీఆర్టీయూ అధ్యక్ష పదవిని ఖాళీగా పెట్టారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వార సంఘం భూమిని అమ్మినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమాజం ఎటుపోతున్నది? ఉపాధ్యాయ వ్యవస్థ ఏమవుతున్నది? ”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్టీయూ పెద్ద సంఘమంటే తాను ఒప్పుకోనని, సంఘానికి అధ్యక్షుడు దిక్కులేకుండా పెద్ద సంఘం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. పీర్టీయూ పెద్ద సంఘమైతే గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని నిలదీశారు.
కేసీఆర్ నే లైన్ లోకి తెచ్చుకున్న
గత ప్రభుత్వ హయాంలో టీచర్ల సమస్యలపై ఎంతో పోరాడానని రఘోత్తం రెడ్డి తెలిపారు. ‘‘గత సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఎలా వ్యవహరించిందో మీకు తెలుసు. ఎమ్మెల్సీగా నేను ప్రగతి భవన్ కు వెళ్తే అపాయింట్ మెంట్ దొరకక, వెనక్కి తిరిగి వచ్చాను. రెండుసార్లు ఇలా జరిగిన తర్వాత బయటకొచ్చి మీడియా సమావేశం పెట్టి నిరంకుశ ప్రభుత్వ పాలన అని మాట్లాడిన. వెంటనే కేసీఆర్ దగ్గరి నుంచి నాకు పిలుపు వచ్చింది. ఏం రఘోత్తం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవ్.. అవన్ని మట్లాడొద్దు జర అని అన్నడు. కేసీఆర్ మా ఫ్యామిలీకి బాగా దగ్గర. మా అన్న క్లాస్ మేట్. అట్లాంటి కేసీఆర్ నే లైన్ లోకి తెచ్చుకొని టీచర్ల సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేశా. 30 శాతంతో ఫిట్మెంట్ వచ్చేలా చేశా”నని ఆయన గుర్తు చేశారు.
సామాజిక న్యాయం నేను ఆచరించి చూపా..
బీసీలు, ఎస్సీలు సామాజిక న్యాయం గురించి తాను మాట్లాడటం కాదు ఆచరించి చూపినట్లు రఘోత్తం రెడ్డి తెలిపారు. ‘‘నా కంటే ఎవరైనా సామాజిక న్యాయం చేశారని నిరూపిస్తే అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తా. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు. వాడు నా ఆలోచనల ప్రకారం కాకుండా ఒక ఎస్సీ అమ్మాయి పేరు చెప్పాడు. నేను వెంటనే అంగీకరించి రూ.2 కోట్లు ఖర్చు పెట్టి 6 వేల మందిని టీచర్లను పిలిచి పెండ్లి గ్రాండ్ గా చేశాను. నేను రెడ్డి మా ఇంటి దేవత ఇప్పుడు ఒక ఎస్సీ. ఇంతకంటే సామాజిక న్యాయం ఇంకేముంటుంది?”అని ఆయన తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద కూడా టీచర్ల సమస్యలు ప్రస్తావించినట్లు రఘోత్తం రెడ్డి గుర్తు చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి టీచర్ల శాలరీల గురించి మాట్లాడిన. ఆయన ఒక్కటే చెప్పారు. ఫ్రీబస్ ద్వారా మహిళా టీచర్లు లబ్ధి పొందుతున్నారు కదా అని అన్నారు. నేను అవును అన్నాను. టీచర్లకు ఒకటో తేదీన వేతనాలు అందుతున్నాయి కదా? ఒక్కటొక్కటిగా సమస్యలు పరిష్కరిద్దాం’’అని సీఎం తనతో చెప్పినట్లు రఘోత్తం రెడ్డి వెల్లడించారు.