ఎన్టీఆర్ కి కూడా భారత రత్న ప్రకటించాలి
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మహాత్మా గాంధీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అశేషమైన కృషి చేసిన వారికే ఈ అత్యున్నతమైన పురస్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గడ్డపై పుట్టి భారత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఒక ఆర్థికవేత్తగా, సంస్కరణల రూపకర్తగా విశేష కృషి చేసిన పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం లభించిందని పులిపాటి తెలిపారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి తెలుగు చలన చిత్ర రంగంలో విశేష అశేష ఖ్యాతిని అందుకొని ఆ తర్వాత రాజకీయంలో రాణించి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన మహానేత నందమూరి తారక రామారావుకు సైతం భారతరత్న పురస్కారాన్ని అందించాలని పులిపాటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు విభిన్నమైన పథకాలతో అనేక రకాలుగా సేవలందించిన నందమూరి కి భారతరత్న వంటి అత్యుత్తమ పురస్కారం దక్కాలని పులిపాటి ప్రసాద్ కోరారు
