ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడికి డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు బహిరంగ లేఖ.

ఓబీసీ నాన్‌`క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని పెంచేదిలేదనడం అన్యాయం
` ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం 789
` ప్రస్తుతం అమలులో 8లక్షలు ఉన్న సీలింగ్‌ ‘‘సంతృప్త స్థాయి’’లో ఉందనడం బీసీలపై కేంద్రం నైజానికి నిదర్శనం.
` డిఓపిటి నిబంధనలను, జాతీయబీసీ కమిషన్‌, ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులను పట్టించుకోకపోవడం దురదృష్టకరం.
` అసలు ఎన్‌సీబీసీ సిఫారసులే చేయలేదని చెప్పడం పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడం, బీసీలకు తీరని నష్టం కల్గించడమే.
ఓబీసీలకు గత ఏడేళ్ళుగా అమలులో ఉన్న నాన్‌ క్రిమిలేయర్‌ 8లక్షల ఆదాయ పరిమితి ‘సంతృప్త స్థాయి’లో ఉందని, ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించడం బీసీలకు తీరని అన్యాయం చేయడమే. ఈమేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బహిరంగలేఖ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ డిఓపిటి నిబంధనలను, జాతీయ బీసీ కమిషన్‌, ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం, పైగా ఆదాయ పరిమితిని పెంచే ఆలోచన కేంద్రానికి లేదని ప్రకటించడం దుర్మార్గం.
లోక్‌సభలో కేంద్ర, సామాజిక న్యాయ సాధికారికత మంత్రి డా॥ వీరేంద్రకుమార్‌ ఈ విధంగా తెల్పడం పట్ల తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నాం. 2015లో జాతీయ బీసీ కమిషన్‌ నాన్‌క్రిమిలేయర్‌ స్థితిని నిర్ణయించడానికి ప్రస్తుతం కూడా అమలులో ఉన్న ఆదాయ పరిమితిని 8లక్షల నుండి 15లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. అందుకు అనుగుణంగా ఒక నివేదికను కేంద్రానికి పంపింది. కాగా ఆనాటి సిఫారసులు తమ పరిశీలనలో లేవని కేంద్ర మంత్రి డాక్టర్‌ వీరేంద్రకుమార్‌ చెప్పడం సభను తప్పుదోవ పట్టించడం బీసీలకు ప్రగతిని నిరోదించడమే.


ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రంలో అమలులోకి వచ్చినప్పటినుండి డిఓపిటి, ఎన్‌సీబీసీలు సమీక్షించి సిఫారసులు చేసిన దరిమిలా అన్ని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొంత జాప్యం చేసినప్పటికీ, ఆదాయ పరిమితిని పెంచుతూ వచ్చాయి. 1993 నుండి ఒకలక్ష పరిమితితో ఆరంభమైన ఈ విధానం 8 లక్షల వరకు చేరుకుంది. ఈ పరిమితి 2017లో స్థిరీకరించడం జరిగింది. డిఓపిటి నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్ళకొకసారి ఆదాయ పరిమితిని సమీక్షించాల్సి ఉంటుంది. అలా పరిశీలించినప్పుడు ఇప్పటికే 2020 నాటికి ఒక గడువు, 2023లో మరో గడువు ముగియనుంది. కాగా పరిమితి పెంపుకోసం చాలానాళ్ళుగా నిరీక్షిస్తున్న ఓబీసీల ఆశలను అడియాశలు చేస్తూ కేంద్రం పెంపుదల చేయబోమని ప్రకటించడం పట్ల బీసీలు నిరాశకు గురౌతున్నారు. ఏ ఆధారం, సమీక్ష నిర్వహించకుండా గతంలోని 8 లక్షల ఆదాయ పరిమితి సంతృప్త స్థాయిలో ఉందని కేంద్ర మంత్రి ప్రకటించడం, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనం.
ఏళ్ళతరబడిగా ఓబీసీలు చేస్తున్న డిమాండ్‌లను కేంద్రం పెడచెవిన పెడుతూనే ఉంది. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బీసీలకు అండగా నిలబడి బరోసానిచ్చే రాజ్యాంగబద్ధమైన జాతీయ బీసీ కమిషన్‌కు ఒక ఛైర్మన్‌ను మాత్రమే నియమించి, వైస్‌ఛైర్మన్‌, సభ్యులను నియమించకపోవడం వలన ఆ సంస్థ ఒక నిరుపయోగమైన వ్యవస్థగా మారిపోయింది. దేశంలో ద్రవ్యోల్భణం పెరిగిపోయి, ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రయివేటీకరణ, కార్పోరేటీకరణ పెరిగిపోయింది. వెరశి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవితాలు భారంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి పెంచడం ద్వారా కొంతమేరకైన అవకాశాలు పొందవచ్చు అని ఎదురుచూస్తున్న ఓబీసీలకు నిరాశే మిగల్చడం, ప్రజాస్వామ్య పాలకులు చేసే పని కాదు.
దేశంలో 56% జనాభా కల్గిన ఓబీసీల సమస్యలను, వారి కనీస అవసరాలను నెరవేర్చకుండా గాలికి వదిలివేయడం సబబు కాదు. ఓబీసీ వర్గాల నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన శ్రీ నరేంద్రమోడి ఈ వర్గాలకు ఎంతో మేలు చేస్తారని ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నప్పటికీ ప్రజలు ఇబ్బందుల పాలు కావడం బాధాకరం.
కేంద్రం తన వైఖరిని మార్చుకొని వెంటనే నాన్‌ క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 15లక్షలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా
ఉంది. మెజారిటీ ప్రజలను వారి ఆకాంక్షలను నెరవేర్చకుండా పాలన సాగడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్య మౌళికతకు విఘాతం. ప్రధానమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ…..

(డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు)

Leave A Reply

Your email address will not be published.

Breaking