జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమ్మ

ఏడుపాయల్లో మంజీరా పరవళ్ళు

 రాజగోపురంలో అమ్మవారికి పూజలు

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా పాపన్నపేట్
24.09.2024

వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది, మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు కు వరద పెరగడంతో ప్రాజెక్టులోకి 29.708టీఎంసీల నీరు చేరింది. దీంతో సోమవారం 11వ గేటు ద్వారా దిగువకు 8142 క్యూసెక్కుల నీటిని వదిలారు. దిగువకు నీరు వస్తుండడంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ సిబ్బంది, అర్చకులు, పోలీసు సిబ్బంది వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని మంగళవారం ఉదయం నుంచి తాత్కాలికంగా మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు. ఇది ఇలా ఉండగా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడం ఇది మూడోసారి.

Leave A Reply

Your email address will not be published.

Breaking