మెదక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ స్టేడియంలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్నియోజకవర్గం జనవరి 26 ప్రజాబలం ప్రతినిధి :-
నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
ఆదివారం, జిల్లా కేంద్రంలోని
మెదక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ గల మినీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్ వివిధ శాఖల అధికారు లతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు కవాతులో పాల్గొని, గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లా ప్రగతిపై వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ఎస్పీ ఉదయ్ కుమార్,అడిషనల్ కలెక్టర్ నగేష్ కలిసి ప్రశంస పత్రాలను అందజేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు శాఖల శకటాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి నృత్యాలు పాటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి కూడా ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందించేందుకు క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలను గుర్తించేందుకు గాను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా, మండల స్థాయి అధికారులు సంయుక్తంగా సమన్వయంతో సర్వేను పక్కాగా నిర్వహించిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో జిల్లా యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు.

భారతదేశం గణతంత్ర దేశముగా ఏర్పడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా పౌరులకు, అధికారులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు మరియు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల త్యాగఫలంగా సిద్ధించిన స్వాతంత్య్ర ఫలాలు అందరికి అందాలని డా|| శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన,గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి 26-01-1950 రోజున మనకు అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలైన ఆ మహానీయులను గుర్తుచేసుకొనుట మన భాద్యత. అని అన్నారు.
తెలంగాణా రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు, వారి త్యాగాలను ఈ రాష్ట్రము ఎప్పటికి మరువదు. సాధించిన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని గౌరవ ప్రజా ప్రతినిధుల, అధికారుల, ప్రజల సహకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మెదక్ జిల్లా ఎప్పుడు ముందడుగులోనే ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. అని వివరించారు.ఈ సందర్భముగా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా ప్రగతిని, సంక్షేమ పథకాలను వివరించారు.
మహాలక్ష్మి (RTC ) ఆర్టీసీ ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 కోటి 83 లక్షల సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 62 కోట్ల 44 లక్షల రూపాయల లబ్ది చేకూరింది. అని అన్నారు.
గృహజ్యోతి- గృహజ్యోతి కార్యక్రమం 200 ద్వారా యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకుంటున్న అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 26 వేల 536 మంది వినియోగదారులకు జీరో బిల్లు జారి చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటివరకు 41 కోట్ల 69 లక్షల సబ్సిడి అందజేసింది అన్నారు.
రైతు భరోసా
రైతు భరోసా పథకం ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు అయిదు వేల రూపాయల చొప్పున, యాసంగి 2023-24 సంవత్సరమునకు గాను మొత్తం 2,63,933 మంది రైతుల ఖాతాల్లో 194 కోట్ల 54 లక్షల రూపాయలు జమ కావడం జరిగింది. ఈ రోజు నుండి ఈ పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు సంవత్సరానికి ప్రతి ఎకరాకు 12000/- రూపాయల చొప్పున, అంటే ప్రతి సీజన్ కు 6000/- రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
రైతు రుణమాఫీ దేశంలో ఎన్నడు జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫిచేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయలు వరకు ఏకకాలంలో ఋణ మాఫీ చేయడంతో రాష్ట్రలోని రైతాంగం నేడు పండగ జరుపుకుంటుంది. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 82 వేల 294 మంది రైతన్నలకు 604 కోట్ల 21 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ- రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయడంతో పాటు, ఈ పథకం ద్వారా పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 14 వేల 989 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు, అందుకు గాను ప్రభుత్వం 36 కోట్ల 85 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అని చెప్పారు.
పౌరసరఫరాల శాఖ
500 రూపాయలకే వంట గ్యాస్*
ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 25 వేల 998 మంది వినియోగదారులకు 3 లక్షల 88 వేల 411 గ్యాస్ సిలిండర్లు పంపిణి చేయడం జరిగింది. దీనికిగాను ప్రభుత్వం 10 కోట్ల 96 లక్షల రూపాయల సబ్సిడీ అందించింది అన్నారు
ధాన్యం కొనుగోలు మరియు సన్నాలకు రూ.500 బోనస్
జిల్లాలో వానాకాలం 2024-25 సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం 92 సన్న ధాన్యం మరియు 404 దొడ్డు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం అయినది. జిల్లాలో ఇప్పటివరకు 2,37,603 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మరియు 53,659 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రైతుల నుండి సేకరించటం జరిగింది. ఈ రోజు వరకు 675.73 కోట్ల రూపాయలు 70,977 మంది రైతుల ఖాతాలలో జమ చేయటం జరిగింది. సన్న ధాన్యం అదనపు ప్రయోజనం కింద 12872 రైతులకు క్వింటాలు కి రూ.500/- ప్రకారం రూ.26.83 కోట్లు అదనంగా జమ చేయటం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఈ పథకం కోసం జిల్లాలో సుమారుగా 1,91,100 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను APP ద్వారా సర్వే నిర్వహించి 100% పూర్తి చేయడం జరిగినది. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాలలో మరియు మునిసిపాలిటిలలో గ్రామా సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి ఇళ్ళను కేటాయించడం జరుగుతుంది. ఈ పథకాన్ని మన జిల్లాలో ఈ రోజు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగుకు గానూ 2000 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 117 మంది రైతులచే 401 ఎకరాల విస్తీర్ణములో 60 లక్షల 95 వేల రూపాయల సబ్సిడీతో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టడం జరిగినది. మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా 743 మంది రైతులకు 1757 ఎకరాల విస్తీర్ణములో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను 4 కోట్ల 43 లక్షల సబ్సిడీ అందించడం జరిగింది.
విద్య
జిల్లాలో 562 పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 20 కోట్ల 62 లక్షల రూపాయల వ్యయంతో మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లాలోని 904 పాఠశాలలకు మరుగుదొడ్లు శుభ్రం చేసుకోవడానికి, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయుటకు మరియు మొక్కలకు నీరు అందించడం గాను ప్రతి పాఠశాలకి స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ క్రింద ఇప్పటివరకు 1 కోటి 52 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో SC, ST, BC, మైనారిటీ మరియు ఇతర రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లలో రివైజుడ్ డైట్ మెనూ పాటించడం జరుగుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం డైట్ చార్జీలను 40% మరియు కాస్మోటిక్ చార్జీలను గతములో కంటే 3 రెట్లు పెంచడం జరిగింది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
జిల్లాలో చేయూత పించండ్ల పథకం ద్వారా 1 లక్ష 15 వేల మంది లబ్దిదారులకు 254 కోట్ల రూపాయలు పించండ్లు పంపిణి చేయడం జరిగింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ ఉపాది హామీ కూలిదారులకు జీవనబృతి కొరకు 14 వేల మంది లబ్దిదారుల జాబితా నుండి అర్హత మేరకు గ్రామ సభ తీర్మాణముతో ప్రతి సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా లబ్ది చేకూర్చేందుకు ప్రణాళికలు చేయడమైనదని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజి ద్వారా 10 వేల 664 సంఘాలకు 592 కోట్ల రూపాయల లక్ష్యం కాగ ఇప్పటివరకు 5 వేల 645 సంఘాలకు 470 కోట్ల 95 లక్షల రూపాయల ఋణాలు అందించడం జరిగింది.
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల 65 వేల పని దినాలు కల్పిస్తూ 88 కోట్ల 83 లక్షల రూపాయల కూలి డబ్బులు చెల్లించడం జరిగింది. 2025-26 సంవత్సరమునకు గాను 469 నర్సరీలలో 28 లక్షల 24 వేల మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు.
మెప్మా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 399 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 40 కోట్ల 26 లక్షల రూపాయల లక్ష్యము కాగా ఇప్పటివరకు 368 సంఘాలకు 49 కోట్ల 80 లక్షల రూపాయల రుణాన్ని మంజూరి చేయడం జరిగింది మరియు 1140 మహిళా సంఘాలకు 1 కోటి 9 లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు మంజూరి చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు గ్రామాలలోని 696 సంఘాలకు 34 వేల 800 పెరటి కోళ్ళ పెంపకం చేపట్టడం జరిగింది.
అటవీ శాఖ
జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా 34 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం కాగా ఇప్పటివరకు 35 లక్షల మొక్కలు నాటడం జరిగింది.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, రోడ్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మునిసిపాలిటులు, వాటర్ సప్లై, వెటర్నరీ మరియు ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాదించడం జరగిందని చెప్పడానికి ఆనందిస్తున్నాను.
శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో, మత్తు పదార్థాల మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలిస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నులుపుటలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పనిచేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొక్కసారి 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్, రెవిన్యూ, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.