ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి

 

ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి

అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 22 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం వయోవృద్దులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె. శ్రీరామ్ తో కలిసి అదనపు కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వి.వి.ప్యాట్ ల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో చైతన్యం కలిగి ఉన్న వయోవృద్ధులు ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ, వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగానే  ఎనభై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు, దివ్యంగులు తమ ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందని వివరించారు. ఇంటి నుండి ఓటు వేయదల్చుకున్న వారు ఎన్నికల ప్రకటన వెలువడిన మీదట నిర్ణీత ఫారం నింపి తమ అభ్యర్థనను తెలియజేస్తే, పోలింగ్ అధికారి నేతృత్వంలోని సిబ్బంది వారి ఇంటి వద్దకు వచ్చి సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సదుపాయాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయోవృద్దుల కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్, వీల్ చెయిర్ వంటి సదుపాయాలూ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేస్తూ, పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా కలెక్టరేట్, ఇతర కార్యాలయాల్లో నమూనా కేంద్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు సీనియర్ సిటిజన్ లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటీజన్స్ ని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు డా. చంద్రమోహన్, కృష్ణయ్య, వయోవృద్దులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking