పసి ప్రాణాలను హరిస్తున్న ఘనులు
నిషేధమున్నా చేస్తున్న స్కానింగ్ లు
పట్టించుకోని జిల్లా వైద్యాధికారి
జగిత్యాల ప్రతినిధి, జనవరి 5:(ప్రజాబలం) లింగ నిర్దారణ పరీక్షలు నేరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయినా జగిత్యాలలో లింగనిర్దారణకై స్కానింగ్ చేస్తూనే ఉన్నారు. ఆడపిల్ల బరువు అనుకునే కొన్ని కుటుంబాలు కడుపులోనే ఆడ, మగలను గుర్తిస్తూ ఆడపిల్లలను ఆకారం సంతరించుకోకుండానే అంతం చేస్తున్న సంఘటనలు జగిత్యాలలో జరుగుతున్న సంఘటనలివి. జగిత్యాల జిల్లా కేంద్రంలో వందకు పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో గైనిక్ ఆసుపత్రుల్లో లింగనిర్దారణ స్కానింగ్ చేసేందుకు వెనుకాడుతున్నట్లు తెలిసింది. వీరి వద్దకు వచ్చే భార్యా భర్తలను నిర్మొహమాటంగా నిర్దారణ పరీక్షలను చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం దీన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదించడమే ప్రధాన వ్యాపారంగా మార్చుకొన్నట్లు తెలిసింది. లింగ నిర్దారణకై వచ్చే దంపతులకు స్కానింగ్ పరీక్షలు చేస్తూ అందులో ఆడపిల్లలను ఆకారం రాకముందే అబార్షన్ల రూపంలో చిదిమేసేందుకు 30 నుంచి 40 వేల వరకు వసూల్ చేస్తున్నట్లు తెలిసింది. ఇలా నిర్దారణ పరిక్షలకై వస్తున్న వారిలో కొందరు మగ పిల్లవాడిగా నిర్దారణ కావడంతో సంతోషంతో ఇంటిబాట పడుతున్నట్లు తెలిసింది. ఈ అక్రమ వ్యాపారానికి కొందరు ఆర్.ఎంపీలు ఏజెంట్లుగా మారి గ్రామీణ ప్రాంతాలలో దంపతులను గొల్లపల్లి రోడ్డులోని ఈ ఆసుపత్రికి తీసుకొచ్చి లింగ నిర్దారణ పరీక్షలకు పురామయిస్తూ తమవంతు కమిషన్లను పొందుతున్నట్లు తెలిసింది. ఇలా ఆ ఆసుపత్రిలో ఇదే ప్రధాన వ్యాపారంగా మారి కాసుల వర్షం కురిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లింగనిర్దారణ పరీక్షల తీరును వ్యతిరేకిసున్న కొందరు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు తమకు తెలిసిన వారితో జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదులు చేయించినట్లు తెలియగా ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం మానేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లింగ నిర్దారణ పరీక్షలను నిర్వహిస్తే పిసి పిఎన్డిటి 1974 యాక్ట్ ప్రకారం 50 వేల జరిమానాతోపాటు ప్రోత్సహించినా, చేయిన్చుకున్నా మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించబడునని ప్రభుత్వం హెచ్చరించినా నిర్దారణ పరీక్షలు అగకపోవడంపై పలువురు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భ శ్రావాలు, బ్రుణ హత్యల నివారణకై జిల్లా స్థాయి అధికారులు మరోసారి నడుము బిగించి అక్రమంగా నిర్దారణ పరీక్షలను నిర్వహిస్తున్న ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.