నేరుగా డబ్బులు తీసుకొన్న పూజారులు
కమాండ్ కంట్రోల్..మల్యాల స్టేషన్లో లైవ్ లే
అంజన్న సన్నిధిలో అవినీతిని ఆపని పోలీసులు
జగిత్యాల ప్రతినిధి, ఎప్రిల్ 10,(ప్రజా బలం)ఎంతో భక్తి శ్రద్ధలతో అంజన్నను మనసులో నింపుకొని మాలదారణ పొందిన అంజన్న భక్తులకు కొండగట్టులో దోపిడీ ఎదురైంది. మాల వితరణకు ఆలయ పూజారులు ఒక్కొక్కరి వద్దనుంచి కనిసంగా యాభై రూపాయల వంతున వసూలు చేయగా నేరుగా మల్యాల పోలీసు స్టేషన్లో, హైద్రాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు సిసి కెమెరాల మానిటరింగ్ ఉన్నా అవినీతి ఆగిపోని సంఘటన ఇది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగే చిన్న హనుమాన్ జయంతికి వివిధ జిల్లాలు, సరిహద్దు రాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షల మంది వరకు హనుమాన్ దీక్షాపరులు చిన్న జయంతికి కొండగట్టు అంజన్నను దర్శించుకొని మాల వితరణ చేశారు. మాల దారులందరిని ఒక విశాల హాలులో కూర్చోబెట్టిన పూజారులు వరుసగా ఒక్కో దీక్షాదారుడి మెడలోంచి మాలను తీశారు. ఈ క్రమములో ఒక్కో దీక్షాపరుడి నుంచి కనిసంగా యాభై రూపాయలను పూజారులు వసూలు చేసినట్లు హనుమాన్ భక్తులే అంటున్నారు. ఈ క్రమములో హాజరైన రెండు లక్షల మంది దీక్షాపరుల్లో లక్ష మంది నుంచైనా సగటున యాభై రూపాయలు వంతున వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ధీనికితోడు మాల తీసేందుకు మరో పదిమంది బయటి పూజరులను ఆలయ అర్చకులు ఇందుకు పిలిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లక్ష్య మంది మాల దారుల నుంచి యాభై రూపాయల చొప్పున వసూలు చేసినా ఈ లెక్కన ఒక్కరోజు ఆలయ అర్చకుల వసూళ్లు యాభై లక్షలకు చేరిందన్న ప్రచారం జరిగింది. సిసి కెమెరాల సాక్షిగా ఈ వసూళ్ల పర్వం రోజంతా జరిగినా దీన్ని పట్టించుకున్న పోలీసులు లేక పోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవలే మల్యాల పోలీసుల నిఘా వైఫల్యం, హైద్రాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణ లోపం మూలంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో చోరీ జరిగి దొంగలు వెండి అభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన అందరికి తెలిసిందే. ఐనా మల్యాల పోలీసుల్లో పరివర్తన ఇంకా రానట్లు పలువురు అంటున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధిలోని సిసి కెమరాలతో తిరిగి నిఘా కొరవడిందన్న సంఘటన మాల దారుల నుంచి అర్చకుల వసూళ్లే నిదర్శనమని పలువురు అంటున్నారు. లక్షలాదిగా భక్తులు, మాలలతో వచ్చే దీక్షా పరులకు పిక్ ప్యాకెట్ చోరులతో, చైన్ స్నాచర్ల నుంచి సిసి కెమెరాలలో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గుట్టపైనున్న పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాల్సిన పోలీసులు తిరిగి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణ పక్కాగా ఉంటే దీక్షా పరుల నుంచి మాల తీసేందుకు మామూళ్లు అడుగుతున్న అర్చకులను ఎందుకు నిరోధించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలోని ఆలయాల్లో కెల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఒక ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ధీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తూ కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటున్న కొండగట్టు గుట్టపై పెరుగుతున్న అవినీతి అక్రమాల నియంత్రణకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.