జిల్లా ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 17: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులు కలిగి ఉండాలని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి జిల్లా ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేని వారు తప్పకుండా ఆధార్ కార్డులు కలిగి ఉండేలా కమిటీ చూడాలని సూచించారు. ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ పదేళ్లకోసారి గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సీఐడీఆర్)లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ ప్రక్రియ కారణంగా పౌరుల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని యూఐడీఏఐ తెలిపింది. దీనికి సంబంధించి మై ఆధార్ పోర్టల్లో కానీ లేనట్లయితే దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఆధార్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపినారు. ఈ ఆధార్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు గురించి ఇప్పటికీ తీసుకోని వారికి తప్పకుండా తీసుకోవాల్సిందిగా తెలియజెప్పాలన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఆధార్ ఉండేలా మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ విషయానికి సంబంధించి తర్వాత జరిగే సమావేశాల్లో తగిన పురోగతి ఉండాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్డీఎమ్) కిశోర్ కుమార్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారిణి పావని, అసిస్టెంట్ మేనేజర్ సత్యకళ (యూఐడీఏఐ), ఈడీఎమ్ భానుప్రకాశ్, మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.