ఓటుపై అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 10:
ఓటు వేసే ప్రతి ఒక్కరికీ తమ ఓటు పట్ల అవగాహన ఎంతో అవసరమని ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేట జిల్లా కలెక్టరేట్లోని ఓటు అవగాహనకై ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఆయా వివరాలను తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన వారు ప్రత్యేకంగా ఉన్న గదిలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎమ్)లో ఓటు ఎలా వేయాలనే వివరాలతో పాటు ఓటు వేసి తాము వేసిన ఓటు చెల్లిందా ? లేదా ? తాము వేసిన వారికే ఓటు వెళ్ళిందా అని కూడా తిరిగి పరిశీలించుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని దీనిని తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి కోరారు. దీంతో పాటు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ ద్వారా ఇక్కడకు వచ్చే వారు ఓటరు అవగాహనకు సంబంధించిన వివరాలతో పాటు ఈవీఎమ్లో డెమోను వినియోగించుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని అధికారులతో పాటు అక్కడకు వచ్చిన ప్రజలతో ఈవీఎమ్లలో ఓటు వేయించి ఈవీఎం ద్వారా ఓటు పడిందీ, లేనిదీ వారికి ప్రత్యక్షంగా తెలిపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి చంద్రావతి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.