ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా, స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీ చౌక్ (మంచిర్యాల చౌరస్తా) వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కు పూల మొక్కతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్మల్ ను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 26 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నియంత్రణ చర్యలను చేపట్టడం ద్వారా 23 ప్రమాద రహిత ప్రదేశాలుగా మార్చినట్లు తెలిపారు. హెల్మెట్ లేని డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేని ప్రయాణం,మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. పోలీసు శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. భద్రత నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు కి కచ్చితంగా వాహన బీమా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగితే, బాధిత కుటుంబాలకు బీమాతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి, వాహనదారులందరికీ బీమా,లైసెన్స్ కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో ‘గిఫ్ట్ ఎ హెల్మెట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు వేడుకలు, పండుగలలో బహుమతులు, మిఠాయిలకు బదులుగా సోదరులకు హెల్మెట్ లను బహుమతిగా ఇవ్వాలి అన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి కలెక్టర్,ఇతర అధికారులు కలిసి హెల్మెట్ లను అందజేశారు.జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే రోడ్డు భద్రత పై అవగాహన కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్పి జానకి షర్మిళ, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్రారెడ్డి లు, ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలి,ఆటో యునియన్ అధ్యక్షులు మల్లేష్, నిర్మల్ పట్టణ తహసిల్దార్ రాజు,డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్లు,ఎన్సీసీ విద్యార్థులు,డ్రైవర్లు, ఇతర అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు