కలెక్టరేట్లోని కంటివెలుగు శిబిరంలో ఉద్యోగులు, సిబ్బంది పరీక్షలు చేయించుకోవాలి
కలెక్టరేట్ కార్యాలయంలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కంటివెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కంటికి సంబంధించి ఇబ్బందులు ఉన్న ప్రజలకు కంటివెలుగు కార్యక్రమం ద్వారా మంచి అనుభవం ఉన్న కంటి వైద్యులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి అప్పుడే కళ్ళద్దాలు అందిస్తున్నారని మరికొందరికి అవసరమైన కళ్ళద్దాలను తెప్పించి ఇవ్వడం జరుగుతోందని వివరించారు. జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం ఎంతో బాగా నిర్వహిస్తున్నారని ఈ విషయంలో ప్రత్యేకంగా కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దీంతో పాటు ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు పరీక్ష కేంద్రంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులు కంటి పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు. ఈ కంటి పరీక్షలలో అవసరమైన వారికి కళ్ళద్దాలు, మందులు, ఐ డ్రాప్స్ కూడా ఉచితంగా అందచేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా కంటివెలుగు పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.