ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 12 : 01-01-2025 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల,బెల్లంపల్లి, చెన్నూర్ ఈ.ఆర్.ఓ.లు శ్రీనివాస్ రావు,హరికృష్ణ, డి.చంద్రకళ లతో కలిసి ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా పరిశీలకులు మాట్లాడుతూ…ఓటర్ల జాబితా సవరణకు ఇది మంచి సమయమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలని,స్పష్టమైన జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని అన్నారు. జాబితాలో రెండు / మూడు ఎపిక్ కార్డులు కలిగిన,చిరునామా మారిన,మరణించిన వారి వివరాలు మార్పులు, సవరణలు,తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని, భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఒకే కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాబితా రూపొందించాలని, వారాంతపు సమావేశాలు నిర్వహించి 2,3 వారాలలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.నూతన ఓటరు నమోదు,జాబితాలో మార్పులు,చేర్పులు, సవరణలు,తొలగింపులపై విస్తృత స్థాయి ప్రచారం నిర్వహంచాలని,నూతన ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకునేందుకు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటుందని, ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,ఇందులో భాగంగా డిగ్రీ కళాశాలల్లో క్యాంపస్ అంబాసిడర్లను నియమించి వారి ద్వారా ప్రచారం ముమ్మరం చేయాలని తెలిపారు.ఈ నెల 26వ తేదీన విద్యాసంస్థల విద్యార్థులు, యువతతో 2కె రన్ నిర్వహించడం జరుగుతుందని,స్వయం సహాయ సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి,ఓటు ఆవశ్యకత,ఓటరు నమోదు,జాబితాలో మార్పులు ఇతర అంశాలపై ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ…పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా 397 దరఖాస్తులు రాగా అన్నింటిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను ఈ నెల 28వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుందని,డిసెంబర్ 24వ తేదీ లోపు పరిష్కరించడం జరుగుతుందని, జనవరి1,2025న తుది జాబితా ప్రచురణ కొరకు ఎన్నికల సంఘం అనుమతి పొంది 6వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 3 లక్షల 23 వేల 278 మంది పురుషులు,3 లక్షల 29 వేల 924 మంది మహిళలు,45 మంది ఇతరులు,39 మంది ఎన్.ఆర్.ఐ.684 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, జిల్లాలో ఎన్నికల నిర్వహణ కొరకు 747 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఎస్.ఎస్.ఆర్.-2025 కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.