వేములవాడ సభకు సర్వం సిద్ధం…!!

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వేములవాడ పర్యటన…!!
ప్రభుత్వ విప్‌ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌
సిరిసిల్ల వేములవాడ ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లను విస్తృతంగా పర్యవేక్షించారు. ప్రభుత్వ విప్‌ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్‌ కేకే మహేందర్‌ రెడ్డి మంగళవారం నాడు ఉదయం ఏర్పాట్లను పరిశీలించారు.
వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలను సమీక్షించి అధికారులకు సూచనలు అందించారు. అంతే కాకుండా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్‌ గెస్ట్‌ హౌస్‌, ఆలయ ఈవో గెస్ట్‌ హౌస్‌ను కూడా సందర్శించి అవసరమైన సౌకర్యాలపై ఆదేశాలు ఇచ్చారు.
సభా ప్రాంగణంలో భక్తులు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేలా ఏర్పాట్లు చేయాలని ఆది శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భక్తులకు దర్శనానికి ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఎల్లప్పుడూ పకడ్బందీగా పనిచేయాలని, అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులు కోరారు. వేములవాడ సభ చరిత్రలో మరో మైలురాయిగా నిలవాలన్న సంకల్పంతో చర్యలు చేపడుతున్నట్లు నేతలు తెలిపారు.
బుధవారం రేవంత్‌ రెడ్డి పర్యటనతో వేములవాడకు కొత్త ఉత్తేజం రావడమే కాకుండా, స్థానిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking