అంగన్వాడీ కేంద్రాల్లో చదివే విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం ప్రారంభం.
వేములవాడ/ తంగళ్ళపల్లి, ( ప్రజాబలం ), ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అంగన్వాడి కేంద్రాలలో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశించారు. బ్లైండ్ నెస్ ప్రివెన్షన్ వీక్ అందత్వ నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో 06 నెలల నుంచి06 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లోని బస్వాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ హాజరై ప్రారంభించారు. వైద్య పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లోని విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏమైనా లోపాలు గుర్తించిన పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు. ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని తెలిపారు.
రిజిస్టర్ల పరిశీలన..
తంగళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠాలు బోధిస్తున్న తీరు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, వైద్యులు నయి మజాహ, సంపత్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.