సంఘటన స్థలాన్ని పరిశీలించిన కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి.
వేములవాడ/ కొనరావుపేట ( ప్రజాబలం), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జరిగిన చోరీ లో 8 తులాల బంగారం,20 కులాల వెండి పట్టగొలుసులు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మామిడిపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బి అనే మహిళ తన భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల మూడవ తేదీన అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన పెద్ద కుమారుడు అబ్దుల్ ఇంటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది. తాళం వేసిన ఇల్లును గమనించిన దొంగలు ఇదే అదునుగా భావించి ఈ నెల నాలుగున రాత్రి సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేయడంతో పాటు తాళం వేసి ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, పెద్ద గొలుసు, చెవుల కమ్మలు, చెవుల దుద్దులతో పాటు, 20 తులాల వెండి పట్టగొలుసులు అపహరించారు. ఆదివారం ఇంటి పక్కన ఉన్న చిన్న కోడలు కిందపడి ఉన్న తాళమును చూసి తన భర్త షబ్బీర్ కు సమాచారం అందించింది. వెంటనే షబ్బీర్ తన కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు షేక్ హుస్సేన్ బి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల నాలుగున షేక్ హుస్సేన్ బి ఇంటికి సమీపంలో మరో మహిళ నిమ్మ రాజుల లక్ష్మి ఇంటి తాళం కూడా పగలగొట్టారు.