పేదవారికి కడుపునిండా సన్న బియ్యంతో భోజనం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం.
తండావాసులతో సరదాగా నృత్యాలు చేసిన విప్ ఆది.
వేములవాడ/ కోనరావుపేట, ( ప్రజాబలం ), తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుపేదలు సన్న బియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం జె సేవాలాల్ తండాలో గిరిజన బిడ్డ ఇస్లావత్ మధుకర్ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఎలా ఉన్నాయి అంటూ కుటుంబ సభ్యులను, తండవాసులను ప్రభుత్వ విప్ అడిగి తెలుసుకున్నారు.
దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపే వాళ్ళం కాదని, ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉందని, తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.

తండా పరిధిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన మంచినీరు ఇప్పటికీ తాగుతున్నామని తండావాసులు తెలిపారు. తామంతా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తండావాసులతో సరదాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నృత్యం చేసి తండావాసులను ఆలరించారు.