హైడ్రాపై సర్కారుకు సరైన విధానం లేదు

 

నాడు ప్రభుత్వాలే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయి.

మరి నేడు అక్రమ నిర్మాణాలు ఎలా అయ్యాయి

ప్రభుత్వ తీరుతో ప్రజల్లో గందరగోళం – అందరితో చర్చించాకే ముందుకెళ్లాలి

-…బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

సంగారెడ్డి ఆగష్టు 24 ప్రజ బలం ప్రతినిధి: హైడ్రాపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన విధానం లేదని బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. సర్కార్ తీరుతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని అన్నారు. ఇకనైనా హైడ్రాను.. హైడ్రామాగా నడిపించడం మానుకోవాలని శ్రీమతి అంజిరెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. అప్పుడు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు కూల్చివేతలు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా స్థలాలను, నీటి వనరులు కాపాడాలని, కానీ అందుకు అందరితో చర్చించి సరైన విధానంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శలు చేశారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్డు, విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని, వారి నుంచి ఎలా పన్నులు వసూలు చేశారని శ్రీమతి గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలు అనుమతి ఇచ్చాక ఎంతో మంది మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అపార్ట్ మెంట్ల లో ఫాట్లు కొనుగోలు చేశారని… ఇప్పుడు అలాంటివి అక్రమ నిర్మాణాలు అంటే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే తీసుకునే ఏ చర్యలైనా చట్ట పరిధిలో ఉండాలే తప్ప, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని పేర్కొన్నారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking