ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 26:
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళిక బద్దంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, అశ్విని తానాజీ వాకాడేతో కలిసి ప్రజాపాలన గ్రామ,వార్డు సభల నిర్వహణకు జరిగిన సన్నహాయ సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని , డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు.ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు.
ప్రతి మండలం పరిధిలో తహసిల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి, ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూల్లో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ప్రజాపాలన సభలలో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామసభల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలు అందించడం జరుగుతుందని, ప్రజాపాలన నిర్వహణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రజా పాలన సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాలని, మున్సిపాలిటీ లలో పారిశుద్ధ్య సిబ్బందిచే ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభల నిర్వహణకు ఇంచార్జి లను ఏర్పాటు చేయాలని, గ్రామ సభలలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, కౌంటర్లలో ఎవరు విధులు నిర్వహించాలని మొదలు కొని ప్రతి అంశం ప్రణాళిక బద్ధంగా జరిగేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒకరోజు ముందుగానే వస్తాయని, గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలని అన్నారు.
ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని త్రాగునీరు, కుర్చీలు, అవసరమైన బల్లలు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని, ఆధార్, రేషన్ కార్డు జత చేసేలా చూడాలని అన్నారు.
ప్రభుత్వం నుంచి దరఖాస్తు ఫారంలు అందిన వెంటనే మండలాలకు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జెడ్పీ సీఈఓ ను ఆదేశించారు. ప్రతిరోజు ప్రజాపాలన సభలలో తీసుకునే దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని, దరఖాస్తుదారునికి రసీదు అందించాలని, ప్రజాపాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ తెలిపారు.
గ్రామసభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద క్యూలైన్ విధానం పాటించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. మండల స్థాయి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజాపాలన నిర్వహణ పట్ల అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజాపాలన సభ నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు.
ప్రజాపాలన గ్రామసభ నిర్వహించే ప్రదేశం, సమయం, వివరాలు ముందస్తుగా ప్రచారం చేయాలని, స్థానిక జడ్పిటిసి, ఎంపిటిసి సర్పంచ్, మొదలగు నాయకులకు తప్పనిసరిగా ఎంపీడీవో లేదా తహసిల్దార్ ఫోన్ ద్వారా సమాచారం అందజేయాలని అన్నారు. గ్రామసభ నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో వరంగల్ రెవెన్యూ డివిజన్ అధికారి వాసు చంద్ర, జెడ్పీ సి.ఈ.ఓ. రామ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking