తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలి

 

ప్రభుత్వ అలసత్వంతోనే రైతులకు నష్టాలు

సకాలంలో కొనకనే పంట నీళ్లపాలు

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

జగిత్యాల, మే 3: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయక ప్రదర్శించిన అలసత్వం మూలంగా పంట నీళ్లపాలైందని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. బుధవారం బుగ్గారం మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన శేకళ్ల, మద్దునూర్ గ్రామాల్లో వివేక్ వెంకటస్వామి పర్యటించి రైతుల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్న ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాల్లో పోశాడన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడం, అలసత్వం ప్రదర్శించడంతోనే రైతన్నలకు ఈ నష్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఎప్పుడు కొంటారో అని రైతులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతుకు ఎకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల మేలుకై అమలు చేస్తున్న ఫసల్ భీమా యోజన పతకాన్ని తెలంగాణలో అమలుచేస్తే రైతులకు నష్టం తప్పెదని వివేక్ వెంకటస్వామి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking