రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 24:రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జీవోల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, ఆబాది గ్రామకంఠం, శిఖం , వక్ఫ్, దేవాదాయ భూముల తదితర వివరాలను ప్రోఫార్మా – 1 ప్రకారం సేకరించామని,. సదరు భూమి క్రమబద్ధీకరణ చేసేందుకు గల అవకాశం, ప్రాతిపదిక, అనుసరించాల్సిన విధానంపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం, ఆబాది మొదలగు కారణాల వల్ల హోల్డ్ లో పెట్టిన దరఖాస్తులు మరోసారి పరిశీలించాలని, ప్రో ఫార్మా –1 ప్రకారం సేకరించిన సమాచారం, సదరు దరఖాస్తులను సరిచూసుకొని నిర్ణయం తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎస్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 పని దినాలలో 51.86 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించామని, జిల్లాలకు చేరే ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో వెంటనే నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు శిబిరాలను పర్యటించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వేసవి దృష్ట్యా క్యాంపుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో కంటి వెలుగు అమలు సంబంధించి కలెక్టర్ల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మరో 21 వేల 787 లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని4578 త్వరితగతిన లబ్దిదారులను ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని, ఈ ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తుల పట్టా సర్టిఫికెట్లను సిద్దం చేశామని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు సమయం తీసుకొని వెంటనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 క్రింద అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దీకరణ రుసుము విడతల వారిగా వసూలు చేయాలని, మొదటి విడత సేకరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జీఓ 59 కు సంబంధించి రుసుము మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు సేకరించి పట్టాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 76 కింద అధికారులు పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ 3 రోజుల్లో పూర్తి చేయాలని, త్వరితగతిన రుసుము వసూలు చేసి మార్చి 20వ తేదీ వరకు పట్టాల పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. పోడు భూముల పంపిణీ సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను డౌన్ లోడ్ చేసి ఒకసారి సరిచూసుకొని పట్టా పాస్ పుస్తకాలు ముద్రణ చేయాలని సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. ఆయిల్ పామ్ సాగు కింద ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను మార్చి లోగా పూర్తి చేయాలని, జిల్లాలో ఎంపిక చేసిన భూములలో వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు నాటాలని, సంబంధిత భూముల డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎస్ అన్నారు. తెలంగాణకు హరితహారం కింద వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలని, దీనికి సంబంధించి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని సీఎస్ సూచించారు.