జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 6 (ప్రజాబలం) ఖమ్మం గ్రామ పంచాయతీ విధులను ప్రత్యేక అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందే సేవలలో ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం విధులను ప్రత్యేక అధికారులు కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులకు, గ్రామ పంచాయతీ విధులు, నూతన పంచాయతీ రాజ్ చట్టం, తదితర అంశాలపై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినందున మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల తో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామాలలో మంచి పరిపాలన అందించే అవకాశం మనకు లభించిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకొని విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, పంచాయతీ నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపు, అభివృద్ధి పనులు, తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు గ్రామసభ, గ్రామ పంచాయతీ తీర్మానాలను స్కాన్ చేసి భద్రపరచాలన్నారు. నేడు గ్రామసభలు నిర్వహించాలని, నేటి నుండి ఈ నెల 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని అన్నారు. డ్రై డే కార్యాచరణ చేయాలన్నారు. ఈ నెల 15న ప్రత్యేక గ్రామసభ చేపట్టి, పారిశుద్ధ్య కార్మికుల సన్మానం చేయాలని, యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని అన్నారు. ప్రత్యేక అధికారులు ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ద్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ లో ప్రస్తుత పారిశుధ్య పరిస్థితిని గమనించాలని, చెత్త సేకరణ, ఇంటి వద్ద తడి, పొడి చెత్త వేరు చేయడం , గ్రామాలలో రోడ్డుపై చెత్త వేయకుండా ఉండడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నీటి సరఫరా లీకేజీల లేకుండా చూడాలని, ఓపెన్ బావులను పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ లలో ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం సంరక్షించే దిశగా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, అలాగే నర్సరీలను పరిశీలించి అక్కడ ఉన్న మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు సైతం ప్రత్యేక అధికారుల పాలనలో స్పష్టమైన మార్పు కనిపించాలని, చిరకాలం ప్రజలు గుర్తుంచుకొనేలా సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారుఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, డిఆర్డీవో విద్యాచందన, డివిజనల్ పంచాయతీ అధికారులు ప్రభాకర్, పుల్లారావు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
