జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎన్ టి ఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు,పుర ప్రముఖులను కలెక్టర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు బహూకరించారు. వ్యవసాయ, ఉద్యానవన,జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ, అటవీ, డెయిరీ, పశువైద్య,విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం,నీటి పారుదల,మిషన్ భగీరథ, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును చాటుతూ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.
ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు* రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నె తెచ్చారు.ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన బాలబాలికలు చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని, జాతీయ సమైక్యతా భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మెమోంటోలను బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు.ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జెండాను ఆవిష్కరించి చిన్నారులకు నోటుబుక్స్, పెన్నులను బహుకరించారు.
ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఎస్పీ జానకి షర్మిళ అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్ మహంతి, రాజేష్ మీనా,ఉపేంద్రా రెడ్డి, ఇతర అధికారులు,సిబ్బంది, ప్రజలు, ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు