ఇంటినే మొక్కల గార్డెన్ గా మార్చిన వనజీవి దాట్ల వెంకటేశ్వర్లు
ఔషధ మొక్కలు సైతం పెంచుతూ అనేకమందికి అందిస్తున్న వైనం
మొక్కల పెంపకంతో పాటు సేవాగుణం కలిగిఉన్న పర్యావరణ ప్రేమికుడు
పర్యావరణ పరిరక్షణకు చేసిన సేవలకు గాను అనేక అవార్డులు ఆయన సొంతం
ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని వనజీవి దాట్ల వెంకటేశ్వర్లు పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నిత్యం తమతమ వ్యక్తిగత పనులతో తీరిక లేకుండా ఉండే మన జీవితాల్లో మన కుటుంబం, మనవాళ్ళు అంటూ వారి కోసం బ్రతకడం తప్ప సమాజహితం అంటూ ఆలోచించేవారు నేటి సమాజంలో లేరనేది కాదనలేని సత్యం. అటువంటిది తన వ్యక్తిగత జీవితం, కుటుంబం మాత్రమే తన బాధ్యత అనుకోకుండా సమాజానికి తనవంతు ఏదైన చేయాలనే తలంపుతో పర్యావరణ ప్రేమికుడిగా మారారు వన ఉన్ సంరక్షకులు దాట్ల వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన దాట్ల వెంకటేశ్వర్లు సింగరేణి ఉద్యోగి. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర్లుకు మొక్కలంటే మహా ఇష్టం. సింగరేణి ఉద్యోగం ఉన్నప్పటికీ మొక్కలపై తన మక్కువ ఏనాడూ తక్కువ కాలేదు. మొక్కలపై ఇష్టాన్ని చంపుకోలేక ఇల్లందు ఏరియా సింగరేణి సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూనే తన ఇంటినే పచ్చని వనంలా మార్చుకున్నారు. వెంకటేశ్వర్లు ఇంటి పరిసరాలు మొత్తం రకరకాల మొక్కలతో దర్షననిస్తు కళకళలాడుతూ కనిపిస్తుంటుంది. గత కొన్నేళ్లుగా అనేకరకాల మొక్కలను నాటుతూ వనజీవి, పర్యావరణ ప్రేమికుడిగా పేరొందారు. మొక్కలు నాటడమే కాకుండా నిత్యం ప్రజలకు పదులసంఖ్యలో మొక్కలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. అయినవారి గురించి కూడా పట్టించుకోని నేటిరోజుల్లో నాకెందుకులే అనుకోకుండా పర్యావరణ పరిరక్షణ తన బాధ్యతగా భావించి సమాజంలోని ప్రతిఒక్కరూ పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలనే సదుద్దేశంతో ఆ దిశగా కృషి చేస్తున్నారు. పలురకాల మొక్కల కోసం తన ఇంటికి వచ్చిన వారిని కాదనకుండా ప్రతిఒక్కరికీ పచ్చని మొక్కలను అందిస్తుంటారు. ఇతరులు కోరుకున్న, అడిగిన ఏ మొక్క అయినాసరే వెంకటేశ్వర్లు ఇంట్లో దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. అలా అందించడమే కాకుండా ఆయా మొక్కల పరిస్థితిని సైతం తెలుసుకుంటూ పర్యావరణం పట్ల తన ప్రేమను చాటుకుంటున్నారు. తన ఇంటిలో పెంచే మొక్కల్లో ముఖ్యంగా కిడ్నీ, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా, కండరాల బలహీనతకు సంబంధించిన మొక్కలు కూడా విరివిగా ఉంటాయి. ఇలా అతడి గార్డెన్ లో ఇలాచీ, మధునాశిని (షుగర్ మొక్క), ఇన్సులిన్, కిడ్నీల్లో రాళ్లు కరిగించే రణపాల, నొప్పులను తగ్గించే కాడజెముడు, ఆస్తమాను తగ్గించే అడ్డరసం, దోమలను అరికట్టే లెమన్ గ్రాస్, లవ్ బర్డ్స్ మొక్కలు, మొగలిపువ్వు, బాగారా, తెల్లఈశ్వరి (సర్పాక్షరి), హనుమాన్ సింధూరం విత్తనాలు, కరక్కాయలు, ఇండోర్ మొక్కలతో పాటు పూలు, పండ్లు వంటి ఇలా అనేకరకాల మొక్కలు దాట్ల ఇంట్లో లభిస్తుండటం విశేషం.

మొక్కల ప్రేమికులతో పాటు వ్యాధిగ్రస్తులు సైతం ఆయన ఇంటికి వచ్చి తమ వ్యాధి నయం చేసుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. ఖాళీ సమయాల్లో తనవద్దకు వచ్చిన వారికే కాకుండా స్వచ్ఛందంగా అనేకమంది ప్రజలను కలిసి వరి కంకులను అందజేసి పర్యావరణం పట్ల బాధ్యతను తెలియజేస్తూ పక్షులకు నీటిని అందించాలని పర్యావరణ సేవకుడిగా వివరిస్తున్నారు. ఇంతేకాకుండా సహాయం అంటూ తన ఇంటి తలుపు తట్టిన పేదవారికి తనవంతు సాయం చేసి తనలోని సేవాతత్పరతను చాటుకున్నారు.
పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గానూ మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలలో మన తెలుగు తేజం జాతీయ పురస్కారం, సావిత్రి భాయి పూలే, యూత్ ఐకాన్ అవార్డ్, పలు కళాశాలల ఎక్సెలేన్స్ అవార్డులు, స్వచ్ఛంద సంస్థల నుంచి సైతం అనేక పురస్కారాలు లభించాయి.

ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషిచేయాలని దాట్ల వెంకటేశ్వర్లు కోరారు. ప్రకృతి పట్ల తన ప్రేమను చూపడంలో తన భార్య, కుటుంబీకుల మద్దతు మరువలేనిదని వారి వల్లే తాను నేడు పర్యావరణ ప్రేమికుడిగా కీర్తిని గడించగలిగానని వారు ఆనందం వ్యక్తం చేశారు