ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 13 : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 15, 16 తేదీలలో జరుగనున్న గ్రూప్-2 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భావన సమావేశ మందిరంలో డి.సి.పి. భాస్కర్,జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, అదనపు డి.సి.పి. రాజు ఆటో కలిసి ముఖ్య పర్యవేక్షకులు,పరిశీలకులు,రూట్ అధికారులతో పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో పరీక్ష నిర్వహణ కొరకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,14 వేల 951 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్ష నిర్వహణ కొరకు నోడల్ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, పోలీస్ నోడల్ అధికారిగా బెల్లంపల్లి ఎ.ఆర్.ఎ.సి.పి. సుందర్, రీజియన్ కో-ఆర్టినేటర్‌గా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డిలను నియమించడం జరిగిందని, ప్రతి పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు,శాఖ అధికారులు, ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్,రూట్, జాయింట్ రూట్ అధికారులు,ఫ్లయింగ్ స్వ్వాడ్ లను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని,త్రాగునీరు,మూత్రశాలలు, నిరంతర విద్యుత్ సరఫరా ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 8:30 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటల నుండి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని, ఉదయం 9:30 గంటలకు,మధ్యాహ్నం 2.30 గంటలకు గేట్లు మూసివేయడం జరుగుతుందని, తదుపరి ఎవరిని అనుమతించడం జరగదని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు,పాస్ పోర్టు, పాన్ కార్డు, డైవింగ్ లైసెన్స్, ఇతర ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు), నలుపు,నీలం బాల్ పెన్నులు తెచ్చుకోవాలని తెలిపారు.హాల్ టిక్కెట్‌పై గత 3 నెలల లోపు దిగిన ఫొటో అతికించాలని, హాల్ టిక్కెట్ ఎ4 కాగితంపై ప్రింట్ తీసుకోవాలని, హాల్ టిక్కెట్ సరిగా లేనట్లయితే అభ్యర్థి 3 పాస్‌పోస్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్ట్ చేయించుకొని వెబ్‌సైట్‌లో ఉన్న నమూనాలో సంతకం చేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు.అభ్యర్థులు ఒక రోజు ముందుగానే వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలను నిర్ధారించుకోవాలని, పరీక్షా సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు,పేజర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాలిక్యులేటర్, ఎనలాగ్/డిజిటల్ గడియారాలు, బ్లూటూత్‌లు లోపలికి అనుమతించబడవని తెలిపారు.హాల్‌టికెట్, వెరిఫికేషన్ కొరకు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని,పరీక్ష ఓ.ఎం.ఆర్.విధానం ద్వారా జరుగుతుందని, అభ్యర్థులు హాల్ టికెట్ ప్రకారం వారికి కేటాయించిన గదులలోకి సమయానికి వెళ్లాలని తెలిపారు.ఈ నెల 15న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ -1,మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2,16వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-3, మధ్యాహ్నం 3 గంటల వరకు సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -4 పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం పరీక్షకు మధ్యాహ్నం 12:30 గంటలు, మధ్యాహ్నం పరీక్షకు సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం గదిలోనే ఉండాలని,పరీక్ష రాసిన అనంతరం ఓ. ఎం.ఆర్.షీట్‌లను ఆయా,ఇన్విజిలేటర్లకు అందించి పరీక్ష ప్రశ్నాపత్రమును తీసుకువెళ్లవచ్చని తెలిపారు.అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని,ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు.
డి సి పి మాట్లాడుతూ… పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రశ్నాపత్రాలు తరలించే సమయంలో ప్రతి వాహనానికి ఇద్దరు ఆర్మెడ్ పోలీస్ అధికారులను కేటాయించడం జరుగుతుందని,ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎస్ ఐ,ఒక మహిళా పోలీస్ అధికారిని నియమించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.